వెన్నులో వణుకుపుట్టించిన దృశ్యం.. గాల్లో కార్ల రేసింగ్‌

6 Nov, 2021 14:40 IST|Sakshi

ఫార్ములా వన్‌ రేసింగ్‌... కార్లు జెట్‌స్పీడ్‌లో ట్రాక్‌మీద దూసుకుపోతుంటే... ఊపిరి బిగబట్టి చూడటం ప్రేక్షకుల వంతవుతుంది. ఇక అవే కార్లు గాల్లో ఎగిరిపోతుంటే ఉండే థ్రిల్‌ అంతా ఇంతా కాదు. వినడానికే వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఈ ఎగిరేకార్ల రేసింగ్‌ గురువారం నాడు ఆస్ట్రేలియాలో జరిగింది.  

దీపావళి పండుగరోజు మన దగ్గర రాకెట్‌ పటాకులు ఆకాశంలో కాంతులీనితే... ఆస్ట్రేలియాలో మాత్రం రెండు కార్లు గాల్లో దూసుకుపోయాయి. ఎయిర్‌స్పీడర్‌ సంస్థ ఎక్సా సిరీస్‌ పేరుతో నిర్వహించిన ఫ్లయింగ్‌ కార్స్‌ రేస్‌లో అలౌడా ఎరోనాటిక్స్‌ కంపెనీ తయారు చేసిన ఎమ్‌కె3 (ఎలక్ట్రికల్‌ వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ల్యాండింగ్‌) కార్లు పాల్గొని విజయవంతంగా రేస్‌ పూర్తి చేశాయి.  

రన్‌వే అవసరమే లేదు...  
ఈ కార్లను నిపుణులైన ఆపరేటర్స్‌ రిమోట్‌ సా యంతో (డ్రోన్ల మాదిరిగా) కంట్రోల్‌ చేశారు. ఈ ఎమ్‌కె3 ఎగిరే కార్లు టేకాఫ్‌ అయిన 2.3 సెకన్లలోనే గంటకు వంద కి.మీ. వేగాన్ని అందుకోగలవు. సాధారణంగా విమానం, హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవ్వడానికి రన్‌వే అవసరం. కానీ.. ఈ కార్లలో ఉన్న వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ కోసం థర్డ్‌ డైమెన్షన్‌ను యాడ్‌ చేశారు. దీంతో ఉన్న చోటనుంచే గాల్లోకి ఎగరగలదు కారు.  

2022 నాటికి పైలట్‌ నడిపేట్టుగా...  
దాదాపు వంద కేజీల బరువున్న ఈ కార్లను కార్బన్‌ ఫైబర్‌తో తయారు చేశారు. పైలట్‌ నడపాలంటే మాత్రం ఎమ్‌కె 4 తయారు చేయాలంటోంది కంపెనీ. 2022 కల్లా సాధ్యం చేసి చూపిస్తామని చెబుతోంది. 

క్షణాల్లో బ్యాటరీ రిప్లేస్‌మెంట్‌... 
సాధారణంగా ఫార్ములావన్‌ రేసింగ్‌లో ఫ్లాట్‌ టైర్‌ అయితే క్షణాల్లో మార్చే అవకాశం ఉంటుంది. ఫ్లయింగ్‌ కార్లలోనూ బ్యాటరీ రిప్లేస్‌మెంట్‌ వేగంగా చేయడం కోసం స్లైడ్‌ అండ్‌ లాక్‌ సిస్టమ్‌ రూపొందించారు. కారు గాల్లో ఉన్నప్పుడు రోటర్‌ లేదా బ్యాటరీ సిస్టమ్‌ ఫెయిల్‌ అయినా సురక్షితంగా ల్యాండయ్యేలా రూపొందించారు. సో పైలట్‌ సేఫ్‌. 

2050 నాటికి లక్షల కోట్ల ఇండస్ట్రీ...  
జాబీ, అలౌడా, జెట్సన్, మేజర్‌ వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌ కంపెనీలన్నీ ఎలక్ట్రికల్‌ వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ వాహనాల మీద పనిచేస్తున్నాయి. ఈ ‘ఎలక్ట్రికల్‌ వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ ఇండస్ట్రీ’ 2050 సంవత్సరం నాటికి లక్షన్నర కోట్ల పరిశ్రమగా అవతరిస్తుందని మోర్గన్‌ స్టాన్లీ అంచనా.  – సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు