Ukraine Russia Conflict: రష్యా దాడి ఖాయమే: బైడెన్‌

20 Feb, 2022 04:29 IST|Sakshi
బెలారస్‌లోని ఒబుజ్‌–లెస్నోవ్‌స్కీ ట్రైనింగ్‌ గ్రౌండ్‌లో జరిగిన రష్యా–బెలారస్‌ మిలటరీ డ్రిల్‌లో యుద్ధ ట్యాంకులు.

వారంలోపు ఉక్రెయిన్‌పైకి సేనలు

రష్యాపై అత్యంత కఠిన ఆంక్షలు

బైడెన్, హారిస్‌ తీవ్ర హెచ్చరికలు

జోరుగా రష్యా అణు విన్యాసాలు

వాషింగ్టన్‌/మ్యూనిచ్‌/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు  బైడెన్‌ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ దాకా చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా వచ్చే వారంలోనే దాడి జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు. రష్యా బలగాలు ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్ద జోరుగా ఫ్లాగ్‌ ఆపరేషన్లు జరుపుతూ కవ్విస్తున్నాయని చెప్పుకొచ్చారు. అవసరం లేని ఈ వినాశకర దాడికి దిగితే రష్యా పశ్చాత్తాపపడేలా చేసి తీరతామని ఆయన హెచ్చరించారు.


 రష్యాలో సైనిక విన్యాసాల్లో భాగంగా ప్రయోగించిన ఇస్కండర్‌–కె క్షిపణి.

ఉక్రెయిన్‌కు సాయంగా అమెరికా సైన్యాలను పంపబోమంటూనే, నాటో సభ్య దేశాలతో కలిసి ఆ దేశ ప్రజలకు అన్నివిధాలా మద్దతుగా నిలుస్తామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలతో కలిసి రష్యాపై కనీవినీ ఎరగనంతటి కఠినాతి కఠినమైన ఆర్థిక, దౌత్య తదతర ఆంక్షలు విధిస్తామని బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ హెచ్చరించారు. చర్చలకు సిద్ధమంటూనే దౌత్యానికి ఒక్కొక్కటిగా దారులను రష్యా మూస్తూ వస్తోందని జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో కమల మండిపడ్డారు.


రష్యా సైనిక విన్యాసాల్లో భాగంగా ప్రయోగించిన ఓ క్షిపణి.

రష్యా దూకుడుకు సమాధానంగా నాటో దళాలు ఆ దేశ లోగిలి దాకా దూసుకెళ్లినా ఆశ్చర్యం లేదని హెచ్చరించారు. జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఆమె భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్ద లక్షన్నర పైచిలుకు సైన్యాన్ని రష్యా మోహరించి ఉంచిందని ఐరాస భద్రతా మండలికి అమెరికా తాజాగా నివేదించింది. కాగా, రష్యా శనివారం అణు, సైనిక విన్యాసాలు జరిపింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల హైపర్‌సోనిక్, క్రూయిజ్‌ క్షిపణులను భూ, సముద్ర లక్ష్యాలపై విజయవంతంగా ప్రయోగించినట్టు ప్రకటించింది. పుతిన్‌ వీటిని బెలారుస్‌ అధ్యక్షునితో పాటు వీక్షించారు.

సైన్యం వర్సెస్‌ రెబెల్స్‌
ఉక్రెయిన్‌ సైన్యంపై దాడికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్, లుహాన్‌స్క్‌ ప్రాంతాల్లోని రష్యా అనుకూల రెబల్‌ ప్రభుత్వాధినేతలు తమ సైన్యాలను ఆదేశించారు. అక్కడి ప్రజలను లక్షలాదిగా ఇప్పటికే రష్యాకు తరలిస్తున్న విషయం తెలిసిందే.  ఉక్రెయిన్, రెబెల్‌ సైన్యాల మధ్య కాల్పులు, ఘర్షణలు నానాటికీ పెరిగిపోతున్నాయి. శనివారం ఉక్రెయిన్‌ సైనికాధికారులను లక్ష్యం చేసుకుని రెబెల్స్‌ భారీగా కాల్పులకు దిగారు.

మరిన్ని వార్తలు