మరింత శక్తివంతంగా చైనా సైన్యం

6 Mar, 2023 05:25 IST|Sakshi

బీజింగ్‌: భారత్, తైవాన్‌లతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. అందులోభాగంగా రక్షణ బడ్జెట్‌ను వరసగా ఎనిమిదోసారి పెంచింది. దీంతో చైనా రక్షణ బడ్జెట్‌ గత ఏడాదితో పోలిస్తే 7.2 శాతం ఎగసి 1.55 ట్రిలియన్‌ యువాన్‌లకు చేరుకుంది. గత ఏడాది 1.45 ట్రిలియన్‌ యువాన్లు కేటాయించింది. డాలర్లలో చూస్తే గత కేటాయింపులు 230 బిలియన్‌ డాలర్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈసారి డాలర్‌తో యువాన్‌ మారకం విలువ తగ్గడంతో కేటాయింపులు గతంతో పోలిస్తే కాస్త తక్కువగా 225 బిలియన్‌ డాలర్లుగా నమోదవడం గమనార్హం. బడ్జెట్‌ వివరాలను ఆదివారం దేశ పార్లమెంట్‌(నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌–ఎన్‌సీపీ)లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆ దేశ ప్రధాని లీ కెక్వియాంగ్‌ సరిహద్దులో సైన్యం విజయాలను గుర్తుచేశారు. ‘ సరిహద్దుల్లో ఆపరేషన్లు విజయవంతమయ్యాయి.

సరిహద్దు రక్షణ, ప్రాదేశిక సముద్రజలాలపై హక్కుల పరిరక్షణ, కోవిడ్‌ సంక్షోభం వంటి వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నాం’ అంటూ పరోక్షంగా తూర్పు లద్దాఖ్‌ను ప్రస్తావించారు. ‘ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ శతాబ్ది ఉత్సవాల నాటికి పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిచేసేలా సైనిక చర్యలను చేపట్టాలి’ అని ఆర్మీనుద్దేశించి అన్నారు. దక్షిణ, తూర్పు సముద్ర జల్లాలపై పూర్తి హక్కులు తమకే దక్కుతాయని వాదిస్తూ పొరుగు దేశాలతో చైనా ఘర్షణలకు దిగడం తెల్సిందే. వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్‌లతో చైనా తగవులకు దిగుతోంది. ఈ ఆర్థికసంవత్సరంలో భారత రక్షణ బడ్జెట్‌ కేటాయింపులు 72 బిలియన్‌ డాలర్లుకావడం గమనార్హం.

మరిన్ని వార్తలు