ట్రంప్‌ చేసిన నేరం ఏమిటి? దోషిగా తేలితే శిక్ష ఎలా ఉంటుందంటే..

5 Apr, 2023 12:39 IST|Sakshi

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ Donald Trumpపై క్రిమినల్‌ అభియోగాలు నమోదు కావడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన మోసాలకు పాల్పడిన ట్రంప్‌పై ఏకంగా 34 నిందారోపణలు అయ్యాయి. ఓ శృంగార తారతో పాటు ఓ ప్లేబాయ్‌ మాజీ మోడల్‌తో సంబంధంతో బయట పడకుండా ఉండేందుకు ఆయన చేసుకున్న అనైతిక ఒప్పందాలే ఆయన్ని ఇలా ఇరకాటంలో పడేశాయి. 

అనైతిక ఒప్పందాలతో వ్యాపార ఒప్పందాల్లో మోసాలకు పాల్పడడం, తద్వారా తన కంపెనీలలో పన్నుల ఎగవేత కుంభకోణం.. ఇది సంక్లిప్తంగా ట్రంప్‌పై మోపబడ్డ అభియోగాల సారాంశం. ఇంతకీ ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగింది?.. ట్రంప్‌ దోషిగా తేలినా ఆయన రాజకీయ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడదా? ఆ అంశాల్లోకి వెళ్తే..  

స్టార్మీ డేనియల్స్‌ ఓ శృంగార తార(మాజీ). 2006లో నెవడాలోని సెలబ్రిటీ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ సందర్భంగా తొలిసారి ఆమె ట్రంప్‌ను కలుసుకుంది. ఆ సమయానికి ఆమె వయసు 27 ఏళ్లు. ట్రంప్‌ వయసు 60. ఆ తర్వాత  టీవీ షోలో పాత్ర కోసం లాస్‌ ఏంజెల్స్‌లోని తన బేవర్లీహిల్స్‌ ఇంట్లో కలవాలని ట్రంప్‌, డేనియల్స్‌కు తన బాడీ గార్డు ద్వారా కబురు పంపారు. అక్కడే డిన్నర్‌ చేశాక.. ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు.

► వాస్తవానికి 2011లోనే ఆమె ట్రంప్‌తో సంబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టినా.. అప్పుడు ఆ అంశానికి పెద్దగా ఫోకస్‌ దక్కలేదు. 

► 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో.. తనకు ఇచ్చిన మాట తప్పడంతో ఈ శృంగార తార సంబంధం బయటపెట్టేందుకు సిద్ధమైంది. అయితే తన లాయర్‌ ద్వారా ఆమెతో ఒప్పందం చేసుకుని.. డబ్బు ద్వారా ఆమె నోరు మూయించే యత్నం చేశాడు ట్రంప్‌.

► ఆ సమయంలో ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాదిగా ఉన్న మైకేల్‌ కోహెన్‌.. డేనియల్స్‌కు లక్షా 30 వేల డాలర్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఆమె గప్‌చుప్‌గా ఉండిపోగా.. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపొందారు.

► 2018 జనవరిలో ఓ అంతర్జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారామె. అప్పటికి ట్రంప్‌ అధ్యక్ష స్థానంలో ఉండేసరికి.. ఇదొక హైప్రొఫైల్‌ కేసు అయ్యింది. ఆమె ఆరోపణలపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగ ప్రవేశం చేశాయి.  

► అయితే విచారణలో కోహెన్‌ మాత్రం అది తన సొంత డబ్బు అని, ట్రంప్‌ చెల్లించలేదని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అదే ఏడాది.. ఫుల్‌ డిస్‌క్లోజర్‌ అనే పుస్తకం ద్వారా ట్రంప్‌తో తనకు జరిగిన పరిచయం, ఆపై విషయాలను ప్రచురించింది స్టార్మీ డేనియల్స్‌. ఈలోపు ట్రంప్‌ తన ప్రచార నిధి నుంచి కాకుండా.. సొంత డబ్బును ఈ అనైతిక ఒప్పందం కోసం చెల్లించాడనే వాదన తెర మీదకు వచ్చింది. 

► 2018 ఫిబ్రవరిలో కోహెన్‌ తన సొంత డబ్బును డేనియల్స్‌కు చెల్లించినట్లు బుకాయించాడు. అయితే.. చివరకు 2018 ఆగస్టులో కోహెన్‌ నేరం అంగీకరించాడు. ట్రంప్‌ ప్రచార నిధి నుంచే ఆ డబ్బు చెల్లించినట్లు చెప్పాడు. దీంతో అదే ఏడాది డిసెంబర్‌లో కోర్టు కోహెన్‌కు మూడేళ్ల శిక్ష ఖరారు చేసింది. 

► 2019 ఆగష్టులో..  ఆ అనైతిక ఒప్పందం చెల్లింపులకు సంబంధించిన రికార్డులను సమర్పించాలంటూ మాన్‌హట్టన్‌ డిస్ట్రిక్‌ అటార్నీ ఆదేశించడంతో.. ట్రంప్‌ ఇరకాటంలో పడినట్లయ్యింది. పన్నుల కుంభకోణంలో.. ట్రంప్‌ సంస్థ తప్పిదం చేసినట్లు నిర్ధారణ అయ్యింది.

► అనైతిక ఒప్పందం.. తద్వారా పన్నుల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ట్రంప్‌ కంపెనీపై అభియోగం నమోదు అయ్యింది. 2023, జనవరిలో.. గ్రాండ్‌ జ్యూరీ ఎదుట ట్రంప్‌ అనైతిక ఒప్పందానికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు. మార్చిలో.. గ్రాండ్‌ జ్యూరీ ఎదుట హాజరు కావాలంటూ ట్రంప్‌కు ఆదేశాలు జారీ కాగా, వాటిని ట్రంప్‌ తిరస్కరించాడు. 

► చివరకు.. 2023 మార్చి చివరి వారంలో మాన్‌హట్టన్‌ డిస్ట్రిక్‌ అటార్నీ ఆయనపై అభియోగాల నమోదు దిశగా సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆయన లొంగిపోతారంటూ ట్రంప్‌ తరపు న్యాయవాది ముందుగానే సంకేతాలు ఇచ్చారు. 

► కోర్టు ఆయనపై నేరాభియోగాలు మోపడానికి, అరెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వడానికంటే ముందే మాన్‌హట్టన్‌ కోర్టులో లొంగిపోవడానికి వెళ్లారు డొనాల్డ్‌ ట్రంప్‌ను. కానీ, సినీ ఫక్కీలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అటుపై లీగల్‌ టీంతో కలిసి కోర్టు విచారణలో పాల్గొన్నారు ట్రంప్‌. గంట పాటు వాదనలు జరగ్గా.. చివరకు బయటకు వచ్చి ఫ్లోరిడాలోని ఇంటికి వెళ్లిపోవడంతో ప్రస్తుతానికి ఎపిసోడ్‌కు కామా పడినట్లయ్యింది. 

► డిసెంబర్‌లో(4వతేదీన) ఈ కేసుకు సంబంధించి మరోసారి ట్రంప్‌ విచారణకు కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

► ఇండియానాకు చెందిన మోడల్‌, నటి మెక్‌డగల్‌(52).. 90వ దశకంలో ప్లేబాయ్‌ మ్యాగజైన్‌ కోసం పని చేసింది. 2006-07 సమయంలో ట్రంప్‌తో తనకు ఎఫైర్‌ ఉందని, అది బయటపడకుండా ఉండేందుకు ట్రంప్‌ తన లాయర్‌ ద్వారా తనకు కొంత డబ్బు ముట్టజెప్పాడని అంటోంది.  2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ వ్యవహారాన్ని బయట పెట్టేందుకు ఓ మీడియా సం‍స్థ ద్వారా లక్షా యాభై వేల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సదరు మీడియా ఏజెన్సీ.. మాన్‌హట్టన్‌ డిస్ట్రిక్‌ అటార్నీ ముందు అంగీకరించింది కూడా.

► ఏది ఏమైనా అమెరికా చరిత్రలోనే తొలిసారి క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది.

ట్రంప్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆయన అధ్యక్ష ఎన్నిక అభ్యర్థితత్వంపై ఎలాంటి ప్రభావం పడకపోవచ్చని న్యాయనిపుణులు చెప్తున్నారు. అలాగే.. న్యూయార్క్‌ చట్టాల దృష్టిలో తక్కువ తీవ్రమైనవి. ఒక్కో లెక్కన వాటన్నింటికి పడేది నాలుగేళ్ల శిక్ష మాత్రమే. ఒకవేళ దోషిగా తేలి శిక్షపడినా కూడా.. ట్రంప్‌ ప్రొబేషన్‌ శిక్షనే ఎదుర్కొంటారు తప్ప ఆయనకు పెద్దగా ఇబ్బంది ఉండదనేది అక్కడి న్యాయనిపుణుల మాట. కానీ, తొలి నుంచి ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్న ట్రంప్‌.. పరిస్థితి అంతదాకా రాదని, పోరాటం ద్వారా రాజకీయ కుట్రను తిప్పి కొడతానని అంటున్నారు.  
 

మరిన్ని వార్తలు