అంతుచిక్కని వ్యాధితో 8 మంది మృతి.. క్వారంటైన్‌లోకి 200 మంది.. రెండు గ్రామాల్లో లాక్‌డౌన్..

11 Feb, 2023 21:00 IST|Sakshi

మలాబో: ఆఫ్రికా దేశం ఈక్వెటోరియల్ గినియాలో అంతుచిక్కని వ్యాధి బెంబేలెత్తిస్తోంది. రక్తస్త్రావ జ్వరంతో 8 మంది చనిపోవడం స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ వ్యాధి ఏంటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఇటీవల ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన 8 మంది తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు. రక్తస్రావం, జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు 200 మందిని క్వారంటైన్‌కు తరలించారు. రెండు గ్రామాల్లో లాక్‌డౌన్ విధించారు.

వ్యాధి బారినపడిన వారి నమూనాలను సేకరించి పొరుగు దేశం గబాన్‌కు పంపారు. లాసా, ఎబోలా వంటి ప్రాణాంతక మహమ్మారులు వెలుగుచూసిన ప్రాంతం కావడంతో కొత్త వ్యాధి గురించి అధికారులు ఆందోళన చెందుతున్నారు.

అంతుచిక్కని వ్యాధిబారిన పడిన వారు ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలతో గంటల్లోనే చనిపోయారని అధికారులు వివరించారు. ఈ వ్యాధిపై నిఘా కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు ఈక్వెటోరియల్ గినియా పొరుగు దేశం కామెరూన్‌ కూడా ఈ వ్యాధి పట్ల అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఇతరులకు ప్రవేశం లేకుండా ఆంక్షలు విధించింది.
చదవండి: టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు..

మరిన్ని వార్తలు