ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ని అమ్ముకోవాలా..?

11 Dec, 2020 04:37 IST|Sakshi

ఫేస్‌బుక్‌ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా అమెరికా దావా

ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ని అమ్ముకోవాలా..?

వాషింగ్టన్‌: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ మరోసారి చిక్కుల్లో పడింది. ఆ సంస్థ గుత్తాధి పత్యానికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం, 48 రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. మార్కెట్‌లో ఎలాంటి పోటీ లేకుండా చిన్న చిన్న సంస్థలన్నింటినీ ఆ సంస్థ కొనుగోలు చేస్తూ ఏకాఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తోందంటూ అమెరికా ప్రభుత్వం కోర్టులో వేసిన దావాలో పేర్కొంది. దీంతో ఫేస్‌బుక్‌కి చెందిన ఇన్‌స్టాగ్రామ్, మొబైల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లను ఆ సంస్థ విక్రయించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.  

పక్కా ప్రణాళికతో గుత్తాధిపత్యం
ఫేస్‌బుక్‌ పక్కా ప్రణాళికతో చిన్న సంస్థల్ని మింగేస్తూ మార్కెట్‌లో గుత్తాధిపత్య ధోరణుల్ని కనబరుస్తోందని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటీషియా జేమ్స్‌ విమర్శించారు. 2012లో ఇన్‌స్ట్రాగామ్‌ని, 2014లో వాట్సాప్‌ని కొనుగోలు చేసి పోటీ లేకుండా చేసుకుందని అన్నారు. వినియోగదారులకు మరో ఎంపిక లేకుండా చేస్తూ ఏ కంపెనీని ఎదగనివ్వడం లేదని ఫెడరల్‌ కమిషన్‌ తన పిటిషన్‌లో పేర్కొంది. ఫేస్‌బుక్‌పై దావా వార్త బయటకు రాగానే ఆ సంస్థ షేర్‌లు దారుణంగా పడిపోయాయి.

నిబంధనలకు అనుగుణంగానే
ఫేస్‌బుక్‌ సంస్థ తాను ఏమి చేసినా ప్రభుత్వ నిబంధనలకు లోబడే చేశామని వాదిస్తోంది. ఏవైనా రెండు కంపెనీలు కలిసిపోవడానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించిందని, ఇప్పుడు అదే ప్రభుత్వం కోర్టుకెక్కడం ఏమిటని ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు జెన్నిఫర్‌ న్యూస్టీడ్‌ అన్నారు. ఫెడరల్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తోందని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు