అంతరిక్షంలో నాట్లు.. వ్యోమోనౌకలోనే పంటలు

9 Feb, 2021 11:10 IST|Sakshi

ప్లాంట్‌ రిసెర్చ్‌లో అద్భుతంగా చెప్పుకోదగ్గ కార్యక్రమం ఇటీవలే భూమికి 400 కిలోమీటర్ల పైన అంతరిక్షంలో జరిగింది. భూమి వాతావరణం లేనిచోట తొలిసారి మొక్కలు నాటే ప్రయత్నం (ప్లాంట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) ఫలించింది. అంతరిక్షంలోని ఐఎస్‌ఎస్‌(అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌)లోని ఐఎస్‌ఎస్‌ వెజిటబుల్‌ ప్రొడక్షన్‌ సిస్టమ్‌ ఫెసిలిటీలో మైక్‌హాప్‌కిన్స్‌ అనే ఆస్ట్రోనాట్‌ ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్‌లో అంతరిక్షంలో భారీగా పంటలు పండించే ప్రయోగాలకు ఇది తొలిమెట్టుగా నాసా వ్యాఖ్యానించింది. ఐఎస్‌ఎస్‌లో పంటలు పండించడంతో అందులోని వ్యోమోగాములకు ఆహార కొరత లేకుండా చూడవచ్చు. అలాగే భవిష్యత్‌లో ఇతర గ్రహాలకు జరిపే ప్రయాణంలో భూమిపై నుంచే ఆహారం తీసుకుపోయే అవసరం లేకుండా అవసరమైనప్పుడు వ్యోమోనౌకలోనే పంటలు పండించుకోవచ్చని అభిప్రాయపడింది.

ఎక్స్‌పెడిషన్‌ 64 కార్యక్రమంలో మైక్‌ పనిచేస్తున్నారు. స్పేస్‌ఎక్స్‌ క్రూ1 మిషన్‌లో భాగంగా ఆయన ఐఎస్‌ఎస్‌కు వచ్చారు. ఐఎస్‌ఎస్‌లో పలు మొక్కలు జీవించలేక పోవడాన్ని గమనించిన మైక్‌ వాటిని తిరిగి నాటడం చేపట్టారు. మొలకల దశలో ఉన్న మొక్కలను ఒకచోట నుంచి తీసి మరోచోట నాటడం అనే ప్రక్రియ సాధారణంగా మొక్కలకు రిస్కుగా భావిస్తారు. కానీ ఐఎస్‌ఎస్‌లో ఈ ప్రక్రియను విజయవంతం గా పూర్తి చేశారని నాసా తెలిపింది. మైక్రోగ్రావిటీ అంతరిక్షంలో పలు ప్రతికూలతలకు కారణమని, కానీ ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మైక్రోగ్రావిటీనే సక్సెస్‌కు కారణమైందని వివరించింది. ఆముదం, ఆకుకూర మొక్కలను ఈ ప్రయోగంలో నాటడం జరిగిందని, అవి బాగానే ఉన్నాయని తెలిపింది. భవిష్యత్‌లో ఈ అంశంపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సైంటిస్టులకు తాజా ఫలితాలు ఉత్సాహాన్నిస్తున్నాయి.

మరిన్ని వార్తలు