నా పిల్లలకు ఈ మాట చెప్పండి..

30 Oct, 2020 12:24 IST|Sakshi

తీవ్రవాద చర్యలను ఉపేక్షించం: ఫ్రాన్స్‌

పారిస్‌/నైస్‌: మతోన్మాద శక్తులను శక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ హెచ్చరించారు. తమ దేశం విలువలను విడనాడదని, అయితే అదే సమయంలో తీవ్రవాద చర్యలను ఖండిస్తుందని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా నైస్‌ సిటీలోని  నాట్రిడేమ్‌ చర్చిలో ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు మహిళలు మరణించిన విషయం విదితమే. వీరిలో ఓ మహిళ తల తెగిపడటంతో ఘటనాస్థలం హాహాకారాలతో దద్దరిల్లింది. ట్యునీషియా నుంచి ఫ్రాన్స్‌కు వలస వచ్చిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా భావిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.(చదవండి: సెకండ్‌ వేవ్‌ మొదలైంది.. మళ్లీ లాక్‌డౌన్‌ )

ఇక ఈ దారుణ ఘటనలో మృతి చెందిన ముగ్గురిలో ఒకరు బ్రెజిలియన్‌(44) అని పేర్కొంది. చర్చి నుంచి రెస్టారెంటుకు పరుగులు తీస్తున్న క్రమంలో దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె.. ‘‘నేను వాళ్లను ఎంతగానో ప్రేమిస్తున్నానని నా పిల్లలకు చెప్పండి’’అంటూ ప్రాణాలు విడిచిందని మీడియా తెలిపింది. కాగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన నైస్‌ నగర మేయర్‌ క్రిస్టియన్‌ ఎస్ట్రోసీ, పోలీసులతో జరిగిన పెనుగులాటలో దుండగుడు గాయపడ్డాడని తెలిపారు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనూ అతడు దేవుడి పేరిట నినాదాలు చేశాడని చెప్పుకొచ్చారు. కాగా ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు వరుస తీవ్రవాద చర్యలతో ఫ్రాన్స్‌ ప్రజలు వణికిపోతున్నారు. దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైన నేపథ్యంలో రెండో దఫా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.(చదవండి: ఫ్రాన్స్‌ చర్చిలో కత్తితో దాడి)

మాక్రాన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం!
అక్టోబర్‌ మొదటి వారంలో మహమ్మద్‌ ప్రవక్త వివాదాస్పద కార్టూన్లను విద్యార్ధులకు చూపిస్తున్నారన్న ఆరోపణలతో ఓ ముస్లిం యువకుడు ఒక ఫ్రెంచ్‌ టీచర్‌ను హతమార్చిన విషయం విదితమే. ఈ విషయంపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. “ ఫ్రాన్స్‌లోని 60 లక్షలమంది ముస్లింలు ప్రధాన జీవన స్రవంతి నుంచి దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అసలు ఇస్లాం మతమే సంక్షోభంలో ఉంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఇస్లాం దేశాలు మాక్రాన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.  మాక్రాన్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఫ్రాన్స్‌లో తయారైన వస్తువుల నిషేధానికి పిలుపునిచ్చాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనం వెలువరించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు