నక్షత్రాలు మెరిసేది అందుకేనంట!

10 Sep, 2021 08:02 IST|Sakshi

మెరుస్తున్న నక్షత్రాలు ఓవైపు.. భూమిపై నగరాల విద్యుత్‌ ధగధగలు మరోవైపు.. మధ్యలో నారింజ రంగులో వాతావరణం మిలమిలలు.. భూమి, వాతావరణం, అంతరిక్షంలో కాంతులు మూడూ ఒకేచోట కనిపిస్తున్న అరుదైన చిత్రమిది. థామస్‌ పెస్కెట్‌ అనే ఫ్రెంచ్‌ వ్యోమగామి.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి ఈ ఫొటో తీశారు. రాత్రిళ్లు భూమ్మీది విద్యుత్‌ లైట్ల కాంతులు ఐఎస్‌ఎస్‌లోని వారికి స్పష్టంగా కనిపిస్తాయి. అదే నక్షత్రాలు ఎప్పుడూ అలా మెరుస్తూనే ఉంటాయి.

చదవండి: ఐన్‌స్టీన్‌, హాకింగ్‌లకన్నా ఈ చిన్నారి బుర్ర మరింత స్మార్ట్‌

కానీ భూమి వాతావరణంలో సుమారు 75 కిలోమీటర్ల ఎత్తున ఉండే సోడియం పొర వెలుగులు మాత్రం.. ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే కనిపిస్తాయి. సూర్యుడు, నక్షత్రాల నుంచి వచ్చే కాంతి, రేడియేషన్‌ ప్రభావం వల్ల.. సోడియం పొర నారింజ రంగులో మెరుస్తుంది. అది ఇలా రాత్రిపూట వెలుగులు విరజిమ్మడం, భూమ్మీది కాంతులు, నక్షత్రాల మెరుపులు జతకూడటం మాత్రం అరుదే. ఇంతేకాదు.. జాగ్రత్తగా గమనిస్తే ఈ నారింజ రంగు పొరపైన సన్నగా ఆకుపచ్చ రంగులో మరోపొరనూ చూడొచ్చు. ఆక్సిజన్‌ ఆయాన్లతో కూడిన ఈ పొర సౌర రేడియేషన్‌ కారణంగా.. ఆకుపచ్చ రంగులో మెరుస్తుంది.   

చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్‌! Co2ను గాల్లోంచి గుంజేసి రాళ్లూరప్పల్లో కలిపేస్తది

మరిన్ని వార్తలు