2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామి.. సరికొత్త లక్ష్యాలతో భారత్‌

17 Oct, 2023 16:09 IST|Sakshi

2035 నాటికి సొంత భారతీయ అంతరిక్ష కేంద్రం

2040 నాటికి  జాబిల్లిపైకి వ్యోమగామి : మోదీ పిలుపు

న్యూఢిల్లీ: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను (చంద్రయాన్‌-3) ల్యాండ్ చేసిన తొలి దేశంగా అవతరించిన ఇండియా అంతరిక్షం, పరిశోధనలు విషయంలో మరింత వేగం పెంచింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కార్‌ సరికొత్త వ్యూహంతో దూసుకుపోనుంది. 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపే లక్ష్యంతో  ప్రధాని మోదీ  శాస్త్రవేత్తలకు ఆదేశాలు జారీ చేశారని కేంద్రం మంగళవారం  ఒక ప్రకటనలో తెలిపింది.

భారతదేశ గగన్‌యాన్ మిషన్ పురోగతి, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశాశం జరిగింది. ఈ సందర్బంగా మోదీ  భ‌విష్య‌త్తు రోద‌సి కార్య‌క్ర‌మాలపై దిశానిర్దేశం చేశారు.

2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రానికి ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి సంబంధించిన ప్రణాళికలతో సహా సరికొత్త వ్యూహంతో సాగాలని ఆదేశించారు. సొంత 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (ఇండియన్ స్పేస్ స్టేషన్)  ఏర్పాటుతోపాటు చంద్రునిపైకి తొలి భారతీయుడిని పంపడం లాంటి సరికొత్త ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఆయన కోరారు. అలాగే వీనస్,అంగారక గ్రహాలకు సంబంధించిన మిషన్లపై పనిచేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఇస్రో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న స్పేస్ డిపార్ట్‌మెంట్ భారత భావి చంద్ర మిషన్‌ల కోసం రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయాలని తదుపరి తరం లాంచ్ వెహికల్ (ఎన్‌జీఎల్‌వీ)అభివృద్ధి, రిటర్న్ మిషన్‌లను చేపట్టడానికి సన్నద్ధం కావాలని ప్రధాని శాస్త్రవేత్తలకు సూచించారు. కొత్త లాంచ్ ప్యాడ్, మానవ-కేంద్రీకృత ప్రయోగశాలలు, అనుబంధ సాంకేతికతలను ఏర్పాటు చేయాలన్నారు.

కాగా ఇస్రో ఆధ్వర్యంలో చంద్రయాన్‌-3  సక్సెస్‌ తరువాత ఇస్రో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాన్నిచేపట్టింది. ఈ  మిషన్‌లోపీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్‌ను  విజయవంతంగా నింగిలోకి పంపించిన సంగతి తెలిసిందే.  మరోవైపు గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించిన తొలి మానవరహిత విమాన  టెస్టింగ్‌  ఈనెల(అక్టోబర్) 21న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య  జరగనుంది. 

గగన్‌యాన్ ప్రాజెక్ట్ అనేది మానవ అంతరిక్ష యాత్రల నిర్వహణలో భారతదేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలవనుంది. ఈ మూడు రోజుల మిషన్‌లో 400 కి.మీ కక్ష్యలో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షయాత్ర  చేయనున్నారు. కాగా గగన్‌యాన్ మిషన్‌ మనుషులను సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి మానవ రేటింగ్ పొందిన ప్రయోగ వాహనం. ఇది అంతరిక్షంలోని వ్యోమగాములకు భూమి తరహా పర్యావరణాన్ని అందించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, అత్యవసర ఎస్కేప్ సదుపాయంతోపాటు పలు క్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధి చేయనుంది. 

మానవ అంతరిక్ష విమాన మిషన్‌ ‍ప్రయోగంలో ముందుగా మిషన్ సాంకేతిక సంసిద్ధత స్థాయిలను ప్రదర్శించనున్నామని అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ డెమోన్‌స్ట్రేటర్ మిషన్‌లలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ), ప్యాడ్ అబార్ట్ టెస్ట్ (పీఏటీ) టెస్ట్ వెహికల్ (టీవీ) విమానాలు ఉన్నాయి. టీవీ-డీ1 పరీక్ష వాహనం ఈ అబార్ట్ మిషన్ కోసం అభివృద్ధి చేసిన ఏక దశ లిక్విడ్ రాకెట్. పేలోడ్‌లలో క్రూ మాడ్యూల్ (సీఎం), క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లు (సీఈఎస్‌) వాటి వేగవంతమైన సాలిడ్ మోటార్‌లతో పాటు సీఎం ఫెయిరింగ్ (సీఎంఎప్‌), ఇంటర్‌ఫేస్ అడాప్టర్‌లు ఉంటాయి.

ఈ ఫ్లైట్ గగన్‌యాన్ మిషన్‌లో మాదిరి మ్యాక్ నంబర్ 1.2కి అనుగుణంగా ఆరోహణ పథంలో అబార్ట్ స్థితిని అనుసరిస్తుంది. సిఎంతో కూడిన సీఇఎస్ పరీక్ష వాహనం నుండి సుమారు 17 కి.మీ ఎత్తులో వేరు అవుతుంది. తదనంతరం అబార్ట్ సీక్వెన్స్ స్వయంప్రతిపత్తితో పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పడు సీఈఎస్‌ని వేరు చేయడం, పారాచూట్‌ల శ్రేణిని మోహరించడం మొదలవుతుంది చివరకు శ్రీహరికోట తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో సురక్షిత టచ్‌డౌన్‌తో ప్రయోగం ముగుస్తుంది’అని అంతరిక్ష సంస్థ వెల్లడించింది.

మరిన్ని వార్తలు