లింగ సమానత్వం మన కళ్ల ముందే కనుమరుగవుతోంది.. మరో 300 ఏళ్లు పడుతుంది: గుటేరస్‌

8 Mar, 2023 15:08 IST|Sakshi

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న లింగ అసమానతలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు.  లింగ సమానత్వం మన కళ్ల ముందే కనుమరుగు అవుతోందని పేర్కొన్నారు. మహిళలు, పురుషుల మధ్య అంతరాలు తగ్గడానికి ఇంకో 300 ఏళ్లు పడుతుందని, ఇది బాధాకరం అన్నారు.

మహిళల హోదా విషయంపై ఐరాస సెషన్‌లో సోమవారం మాట్లాడుతూ గుటేరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల హక్కులను అవహేళన చేస్తూ, ప్రమాదంలోకి నెడుతూ, ఉల్లంఘిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. లింగసమానత్వంపై సాధించిన దశాబ్దాల పురోగతి మన కళ్ల ముందే కనుమరుగు కావడం ఆలోచించాల్సిన విషయమన్నారు.

అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కులను తాలిబన్ ప్రభుత్వం కాలరాస్తున్న విషయాన్ని కూడా గుటెరస్ ప్రస్తావించారు. సాధారణ ప్రజా జీవితానికి వాళ్లను దూరం చేశారని చెప్పారు. చాలా దేశాల్లో మహిళల లైంగిక, పునరుత్పత్తి హక్కులను కూడా హరించివేస్తున్నారని తెలిపారు.

కొన్ని దేశాల్లో పాఠాశాలకు వెళ్లే చిన్నారులను కిడ్నాప్ చేసి దాడులు చేస్తున్నారని, మరికొన్ని దేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వాళ్లపై దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు. లింగ సమానత్వ అంతరం రోజురోజుకు మరింత పెరుగుతోందన్నారు.
చదవండి: అంటార్కిటికా కరిగిపోతోంది! 

మరిన్ని వార్తలు