ఊహించనంత వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు.. లీడ్స్‌ యూనివర్సిటీ హెచ్చరిక

21 Dec, 2021 04:53 IST|Sakshi

హిమానీనదాలపై లీడ్స్‌ యూనివర్సిటీ హెచ్చరిక

బ్రహ్మపుత్ర, గంగా, సింధు నదులకు ముప్పు  

లండన్‌: పలు జీవనదులకు పుట్టిల్లైన హిమాలయాల్లోని హిమానీ నదాలు (గ్లేసియర్లు) ఊహించనంత వేగంగా కరిగిపోతున్నాయని లీడ్స్‌ యూనివర్సిటీ నివేదిక హెచ్చరించింది. భూతాపం అనూహ్యంగా పెరుగుతుండడమే ఇందుకు కారణమని, దీనివల్ల ఆసియాలో కోట్లాది ప్రజలకు నీటి లభ్యత ప్రశ్నార్ధకం కానుందని తెలిపింది. లండన్‌కు చెందిన ఈయూనివర్సిటీ నివేదిక జర్నల్‌ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురించారు.

400–700 సంవత్సరాల క్రితం జరిగిన గ్లేసియర్‌ ఎక్స్‌పాన్షన్‌ సమయం (లిటిల్‌ ఐస్‌ ఏజ్‌)తో పోలిస్తే గత కొన్ని దశాబ్దాల్లో హిమాలయన్‌ గ్లేసియర్స్‌లో మంచు పదింతలు అధికంగా కరిగిపోయిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హిమానీ నదాల కన్నా హిమాలయాల్లోని గ్లేసియర్లు అత్యంత వేగంగా కుంచించుకుపోతున్నట్లు హెచ్చరించింది. హిమాలయాల్లోని 14,798 గ్లేసియర్లు లిటిల్‌ ఐస్‌ ఏజ్‌ సమయంలో ఎలా ఉన్నాయో నివేదిక మదింపు చేసింది.

అప్పట్లో ఇవి 28 వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండగా, ప్రస్తుతం 19,600 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యాయని, అంటే దాదాపు 40 శాతం మేర కుచించుకుపోయాయని తెలిపింది. ఆ సమయంలో మంచు కరుగుదల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు 0.92– 1.38 మీటర్ల చొప్పున పెరిగాయని, ప్రస్తుత మంచు కరుగుదల అంతకు పదింతలు అధికంగా ఉందని నివేదిక రచయిత జొనాధన్‌ కార్విక్‌ చెప్పారు.  మానవ ప్రేరిత శీతోష్ణస్థితి మార్పుల కారణంగా మంచు కరిగే వేగం పెరిగిందన్నారు.  

మూడో అతిపెద్ద గ్లేసియర్‌ సముదాయం
అంటార్కిటికా, ఆర్కిటికా తర్వాత హిమాలయాల్లోని గ్లేసియర్లలో మంచు అధికం. అందుకే హిమాలయాలను థర్డ్‌ పోల్‌ (మూడో ధృవం)గా పిలువడం కద్దు. ఆసియాలోని అనేక దేశాల జనాభాకు అవసరమైన పలు నదులకు ఈ హిమానీ నదాలు జన్మస్థానం. వీటి క్షీణత కోట్లాది మందిపై పెను ప్రభావం చూపుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బ్రహ్మపుత్ర, గంగ, సింధుతో పాటు పలు చిన్నా పెద్ద నదులకు హిమాలయాలే జన్మస్థానం. గతకాలంలో మంచు కరుగుదల, గ్లేసియర్ల విస్తీర్ణం మదింపునకు పరిశోధక బృందం శాటిలైట్‌ చిత్రాలను, డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించింది.

గతంలో గ్లేసియర్లు ఏర్పరిచిన హద్దులను శాటిలైట్‌ చిత్రాల ద్వారా కనుగొని, ప్రస్తుత హద్దులతో పోల్చడం ద్వారా వీటి క్షీణతను లెక్కించారు. హిమాలయాల తూర్పు ప్రాంతంలో గ్లేసియర్ల క్షీణత వేగంగా ఉంది. హిమానీ నదాలు సరస్సుల్లో కలిసే ప్రాం తాల్లో వీటి క్షీణత అధికంగా ఉంది. ఇలాంటి సరస్సుల సంఖ్య, విస్తీర్ణం పెరగడమనేది గ్లేసియర్లు కుంచించుకుపోతున్నాయనేందుకు నిదర్శనమని తెలిపింది. మానవ ప్రేరిత ఉష్ణోగ్రతా మార్పులను అడ్డుకునేందుకు తక్షణ యత్నాలు ఆరంభించాలని నివేదిక పిలుపునిచ్చింది.  

మరిన్ని వార్తలు