మరణించిన వారిని మళ్లీ పునర్జీవింప చేసే సంస్థ...మళ్లీ బతకాలని....

28 Nov, 2022 20:23 IST|Sakshi

ఎవరైనా మృతి చెందితే సహజంగా అంతిమ సంస్కారాలు జరిపి అక్కడితే వదిలేస్తాం. కొన్నేళ్లు బాధలో ఉండిపోతాం. క్రమేణా వారి జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు యత్నిస్తాం. కానీ కొంతమంది తమ వారు చనిపోయిన వారు ఏదోనాటికి తిరిగి వస్తారన్న ఆశతో వారి శరీరాలను భద్రంగా దాచుతున్నారట. అందు కోసం అమెరికాలో ఒక సంస్థ ఈ సేవను పెద్ద మొత్తంలో రుసుముతో అందిస్తోంది కూడా. అక్కడ పలువురు శరీరాలను కొన్ని రకాల ఉష్ణోగ్రత మధ్య వివిధ రసాయానాల సాయంతో అత్యంత భద్రంగా ఉంచాతారట. 

వివారాల్లోకెళ్తే...చనిపోయినా మళ్లీ బతికి రావడం వంటి వాటిని సినిమాల్లోనే చూస్తాం. నిజ జీవితంలో అసాధ్యం. కానీ సాధ్యం చేయాలనకుంటున్నారు యూఎస్‌లోని అల్కోర్‌ లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ. ఇక్కడ చనిపోయిన మానవులు భవిష్యత్తులో ఎప్పటికైనా తిరిగి బతికివస్తారనే ఆశతో జాగ్రత్తగా వారి మృతదేహాలను కాపాడతారు. దీన్ని క్రయో ప్రెజర్వ్‌ అంటారు. చనిపోయిన వారిని లిక్విడ్‌ నైట్రోజన్‌తో నిండిన స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ ట్యాంకులో ఉంచుతారు.

ఇందులో వాటిని మైనస్‌ 196 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల వద్ద దశాబ్దాల పాటు జాగ్రత్తగా ఉంచుతారు. దీన్ని క్రయోనిక్స్‌ అంటారు. వాళ్లు భవిష్యత్తులో ఏనాటికైనా మేల్కొనేలా సాంకేతిక వైద్యం అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఇలా చేస్తున్నారట. ఇలా తొలిసారిగా బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న థాయ్ అమ్మాయి మాథెరిన్ నవోరాట్‌పాంగ్ 2015లో 2 సంవత్సరాల వయస్సులో క్రయో ప్రెజర్వ్‌ చేసిన పిన్న వయస్కురాలు. ఈ అమ్మాయి తల్లిదండ్రులిద్దరూ వైద్యులు, ఆమెకు మెదడుకు సంబంధించిన ఎన్నో శస్త్ర చికిత్సలు చేశారు గానీ ప్రయోజనం లేకపోవడంతో యూఎస్‌లోని అల్కోర్‌ ఫౌండేషన్‌ని సంప్రదించి క్రయో ప్రిజర్వ్‌ చేశారు. అలా బిట్‌కాయిన్‌ మార్గదర్శకుడు హాల్‌ ఫిన్నీ, 2014లో మృతి చెందిన తర్వాత క్రయో ప్రిజర్వ్‌ చేశారు.

వాస్తవానికి ఒక వ్యక్తి చట్టబద్ధంగా చనిపోయిన తర్వాత క్రయో ప్రెజర్వేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో శరీరాన్ని రక్షించేందుకు అల్కోర్‌ సంస్థ ఉపయోగించే ప్రక్రియను విట్రిఫికేషన్‌ అంటారు. అందులో రోగి శరీరం నుంచి రక్తం, ఇతర ద్రవాలు తొలగించి హానికరమైన మంచు స్పటికాలు ఏర్పడకుండా నిరోధించే రసాయనాలతో భర్తీ చేస్తారు. అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద విట్రిఫై చేసే ట్యాంకుల్లో ఉంచుతారు. అందుకోసం ఒక్క మృతదేహానికి సుమారు రూ. కోటి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం రోగి మెదడుని మాత్రం క్రయో ప్రిజర్వ్‌ చేయాలంటే దాదాపు రూ. 65 లక్షలు ఖర్చవుతుంది.

ఇప్పటివరకు 500 మంది వ్యక్తుల తమ శరీరాలను క్రయో ప్రిజర్వ్‌ చేయడానికి  ఈ సంస్థను సంప్రదించారని చెబుతున్నారు ఫౌండేషన్‌ అధికారులు. ప్రస్తుతానికి ఈ సంస్థలో సుమారు 199 మంది మానవులను, దాదాపు100 పెంపుడు జంతువులను క్రయో ప్రిజర్వ్‌ చేశారు. అసలు ఈ ఫౌండేషన్‌ను 1972లో లిండా, ఫ్రెడ్‌చాంబర్‌ లైన్‌ అనే వ్యక్తులు 1972లో స్థాపించారు. జీవితంలో రెండో అవకాశాన్ని ప్రజలకు అందించే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ మేరకు న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో మెడికల్ ఎథిక్స్ విభాగానికి అధిపతిగా ఉన్న​ ఆర్దర్‌ మాట్లాడతూ...ఈ వైజ‍్క్షానిక కల్పన అనేది ఊహజనితం, సాధ్యమవుతుందని కూడా చెప్పలేం. కానీ చాలా మంది తమవాళ్లు తిరిగి పునర్జీవించేలా సైన్సు అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఇలా చేస్తున్నారు. ఇది కేవలం డబ్బు ఉన్నవాళ్లు  దొరికిన సువర్ణావకాశంగా పేర్కొన్నారు. ఐతే పలువురు శాస్త్రవేత్తలు మాత్రం క్రయోప్రిజర్వ్‌ చేయబడిన వ్యక్తులు వాళ్లు తిరిగి జీవించి వస్తే అతని చుట్టు ఉన్నా దశాబ్దాల నాటి ప్రపంచానికి ప్రస్తుత ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. దీంతో ఆ వ్యక్తి  ప్రస్తుత ప్రపంచానికి ఒక గ్రహాంతరవాసిగా కనిపిస్తుంటాడని చెబుతున్నారు.

(చదవండి: ఎంతపనిచేసింది ఆ దోమ..నాలుగు వారాల కోమా, ఏకంగా 30 సర్జరీలా!)

మరిన్ని వార్తలు