బ్రిటన్‌ పీఎం పీఠంపై రిషి సునాక్‌.. భారత్‌లో మీమ్స్‌ వడ్డన

25 Oct, 2022 21:32 IST|Sakshi

బ్రిటన్‌ ప్రధాని పీఠంపై చిన్న వయసులో.. అదీ తొలి శ్వేతజాతీయేతరుడిగా రిషి సునాక్‌ పగ్గాలు అందుకున్నారు. భారత మూలాలు ఉన్న వ్యక్తి, పైగా మన దేశపు అల్లుడు కావడంతో ఇక్కడి నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మీమ్స్‌ వడ్డన మామూలుగా ఉండడం లేదు. రెండు రోజులుగా కొనసాగుతూనే ఉంది.

ప్రముఖ భారత క్రికెటర్‌ అశిష్‌ నెహ్రా.. రిషి సునాక్‌ కవలలు అంటూ మొదలైన మీమ్స్‌ ఫెస్టివల్‌.. ఇవాళ అధికారికంగా ఆయన ప్రధానిగా నియామకం అయిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ఆయనకు భారతీయులు ట్విటర్‌ ద్వారా చేసిన తొలి విజ్ఞప్తి.. కోహినూర్‌ వజ్రాన్ని ఎలాగైనా భారత్‌కు పంపించాలని. 

అలాగే.. వలసవాదులను వలసరాజ్యంగా మార్చేసి.. పాలించబోతున్నారంటూ మరో సెటైర్‌ పేలుస్తున్నారు. ఇక యూకే ప్రధాని అధికారిక భవనం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ డోర్లకు దండలు, ఆ బయట చెప్పులు విడిచేసి ఉండడం, కాపలాగా వాచ్‌మెన్‌ ఉండడం.. ఇలా దేశీ టచ్‌ను మీమ్స్‌కు జత చేసి హిలేరియస్‌ ఫన్‌ను పుట్టిస్తున్నారు.  
 ​
మరోవైపు రిషి సునాక్‌ ప్రధాని అయ్యాడు కాబట్టి..  ఇడ్లీ, వడ, చట్నీ, కాఫీ.. మెనూలో చేరతాయని జోకులు పేలుస్తున్నారు. ఇక పాక్‌కు బర్నల్‌ పంపాల్సిన అవసరం ఉందంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి గనుక అల్లుడి ఇంటికి వెళ్తే.. 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ కాస్త తీన్‌ మూర్తి భవనం(రిషి సునాక్‌ భార్య అక్షతా మూర్తితో కలిపి) అవుతుందని జోకులు పేలుస్తున్నారు.

మరిన్ని వార్తలు