కుక్కలా కనిపించేందుకు లక్షలు కుమ్మరించాడు.. ఇప్పుడేమో భయంతో..

29 Dec, 2022 21:31 IST|Sakshi

వైరల్‌: మనిషి బుర్రలోంచి చిత్రవిచిత్రమైన ఆలోచనలెన్నో పుడుతుంటాయి. వాటిని ఆచరణలో పెట్టడానికి  ఎంతదాకా అయినా వెళ్లే వాళ్లు కొందరు ఉంటారు. ఓ వ్యక్తి కుక్కలాగా కనిపించేందుకు లక్షలు కుమ్మరించాడని ఆ మధ్య చదువుకున్నాం కదా. ఆ వ్యక్తే ఇప్పుడు తెగ భయపడుతున్నాడు. అది ఎందుకో అతని మాటల్లోనే.. 

జపాన్‌కు చెందిన టోకో ఈ ఏడాది మే నెలలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు. కుక్కలాగా కనిపించేందుకు విపరీతంగా ఖర్చు చేశాడతను. ఏకంగా మన కరెన్సీలో 12 లక్షల రూపాయలతో(అక్కడి కరెన్సీలో రెండు మిలియన్ల యెన్‌లు) కోలీ అనే డాగ్‌బ్రీడ్‌ కాస్టూమ్‌ను తయారు చేయించుకున్నాడు. ఆల్ట్రా రియలిస్టిక్‌ కాస్టూమ్‌లో నిజం కుక్కను తలపించాడతను. తద్వారా తన చిన్ననాటి ఊహను నిజం చేసుకున్నాడు కూడా.  అయితే..

ఇంతకాలం కుక్క తరహాలో వీడియోలు చేస్తూ పోతున్న టోకో.. ఇప్పుడు సడన్‌గా బాధను. భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తాను తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి పరిణామానికి దారి తీస్తుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ‘‘ఒక జంతువులా ఉండాలని చిన్నప్పుడు అనుకునేవాడిని. కుక్క తరహా జీవనం.. నాకు హాయిగానే అనిపిస్తోంది. కానీ, ఇప్పుడు నాది నిజంగానే కుక్క బతుకు అయ్యింది. రాను రాను ఈ చర్య.. నావాళ్లను నాకు దూరం చేస్తుందనే భయం రేకెత్తిస్తోంది. 

నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇప్పటికిప్పుడు ఇది బాగానే ఉండొచ్చు. కానీ, నేనొక వింత మనిషిని అని వాళ్లు తర్వాతి రోజుల్లో అనుకునే ప్రమాదం లేకపోలేదు. అది వాళ్లను నాకు దూరం చేస్తుందనే భయం కలుగుతోంది. వీలైనంత త్వరలో ఈ రూపానికి స్వస్తి పలికేందుకు యత్నిస్తా అని చెబుతున్నాడు టోకో. అలాగని 24 గంటలూ అతను కుక్క కాస్టూమ్‌లోనే ఉంటున్నాడేమో అనుకోకండి. అప్పుడప్పుడు మాత్రమే ఆ కాస్టూమ్‌లో దూరిపోయి.. కుక్క ప్రవర్తించినట్లే ప్రవర్తించి తన సరదా తీర్చుకుంటున్నాడట. 

మరిన్ని వార్తలు