ఖలిస్తాన్‌ రెఫరెండం!

12 Sep, 2023 05:43 IST|Sakshi

కెనడాలో ఎస్‌ఎఫ్‌జే నిర్వాకం ∙స్పందన కరువు

టొరంటో: భారత వ్యతిరేక శక్తులు కెనడాలో తిష్టవేశాయని స్వయంగా ఆ దేశ ప్రధాని ట్రూడో ఎదుటే ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేసిన వేళ అదే రోజు మరో పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ను విడగొట్టి సిక్కుల కోసం ఖలిస్తాన్‌ను ఏర్పాటుచేయడంపై అభిప్రాయం తెలపాలంటూ కెనడాలో సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌(ఎస్‌ఎఫ్‌జే) వేర్పాటువాద సంస్థ రెఫరెండం నిర్వహించింది. సుర్రే పట్టణంలో ఎస్‌ఎఫ్‌జే వ్యవస్థాపకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ సారథ్యంలో సిక్కు ప్రజాభిప్రాయ సేకరణ(రెఫరెండం) చేపట్టారు.

భారీ వ్యక్తిగత భద్రత నడుమ రెఫరెండం ప్రాంతానికి వచి్చన గురపత్వంత్‌ అక్కడే భారత వ్యతిరేక విద్వేష ప్రసంగం చేశారు. గురు నానక్‌ సింగ్‌ గురుద్వారా వద్ద జరిగిన ఈ రెఫరెండం తంతులో దాదాపు 7వేల మంది పాల్గొన్నారు. దాదాపు 50 వేలకుపైగా జనం వస్తారని ఆశించిన నిర్వాహకులకు భంగపాటు ఎదురైంది. కెనడా ప్రధాని ట్రూడోతో మోదీ ఖలిస్తాన్‌ వేర్పాటువాదం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించిన ఆదివారం రోజే ఈ రెఫరెండంను ఎస్‌ఎఫ్‌జే నిర్వాహకులు పనిగట్టుకుని నిర్వహించారు.

అంతకుముందు పత్వంత్‌ సింగ్‌ ఒక ఆడియో సందేశం విడుదలచేశారు. ‘ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతున్న ప్రగతి మైదాన్‌ ప్రాంగణానికి భారీ సంఖ్యలో వెళ్లి నిరసన గళం వినిపించండి’ అని కశీ్మర్‌ లోయలో నివసించే ముస్లింలకు పిలుపునిస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖలిస్తాన్‌ వేర్పాటువాద జెండా ఎగరేస్తామని పత్వంత్‌సింగ్‌ సవాల్‌ చేశారు.  

మరిన్ని వార్తలు