-

నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ..

27 Nov, 2023 09:10 IST|Sakshi

వాషింగ్టన్‌: మానవునిలో పెద్ద పేగు దాకా ఏదైనా ఆహారం వెళ్లి దంటే అప్పటికే అది జీర్ణమైందని అర్ధం. అయితే అమెరికాలో ఓ పెద్దాయన పెద్దపేగులో ఒక ఈగ చిధ్రమవకుండా చక్కగా ఉంది. జీర్ణావస్థలోకాకుండా పేగు గోడలకు అతుక్కుని ఉన్న ఈగను చూసి అక్కడి వైద్యులు అవాక్క య్యారు. జీర్ణాశయం, చిన్నపేగును దాటి కూడా ఈ కీటకం ఎలా జీర్ణమవకుండా ఉందబ్బా? అని వైద్యులు పలు విశ్లేషణలు మొదలుపెట్టారు.

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ వింత ఘటన జరిగింది. ‘ది అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటెరాలజీ’లో సంబంధిత వివరాలతో కథనం వెలువడింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా 63 ఏళ్ల పెద్దాయన ఆస్పత్రికి రాగా ఆయనకు వైద్యులు కొలొనోస్కోపీ చేశారు. అందులో ఈ విషయం వెల్లడైంది. ‘‘ కొలొనోస్కోపీకి ముందు ఘన పదార్థాలు ఏవీ నేను తీసుకోలేదు. రెండు రోజుల క్రితం మాత్రం పిజ్జా, తోటకూర తిన్నాను. అసలది ఎలా లోపలికెళ్లిందో నాకైతే తెలీదు’’ అని ఆ పెద్దాయన తాపీగా చెప్పారు.

‘‘తిన్న వాటిని జీర్ణరసాలు, పొట్టలోని ఆమ్లాలు జీర్ణం చేస్తాయి. అయినాసరే ఈగ అలాగే ఉందంటే ఆశ్చర్యమే. అయితే ఇది ఇంటెస్టినల్‌ మయాసిస్‌ అయి ఉండొచ్చు. ఈగ గుడ్లు లేదా లార్వా ఉన్న ఆహారం తిని ఉండొచ్చు. అవి లోపలికెళ్లి జీర్ణమయ్యాక కూడా జీర్ణవ్యవస్థలోని అసాధారణ వాతావరణాన్ని తట్టుకుని ఒకే ఒక్క లార్వా ఇలా ఈగగా రూపాంతరం చెంది ఉంటుంది’’ అని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో గ్యాస్ట్రోఎంటెరాలజీ విభాగ సారథ మ్యాథ్యూ బెక్‌టోల్డ్‌ విశ్లేషించారు.

‘ఇలాంటి సందర్భాల్లోనూ వ్యక్తికి విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి ఉంటాయి. అయినా సరే ఈయనకు అవేం లేవంటే నిజంగా ఇది వింతే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన ఆ ఈగను కొలొనోస్కోపీ ద్వారా ఎట్టకేలకు బయటకు తీశారు. ఇంత జరిగినా పెద్దాయన ఆరోగ్యంగా ఉండటం విశేషం.
చదవండి: మంచు‘మాయం’
 

మరిన్ని వార్తలు