ఆ నేరానికి గానూ... ఒక వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష!!

18 Dec, 2021 12:12 IST|Sakshi

వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చాలని డిమాండ్ చేస్తూ అమెరికా పార్లమెంటు 'క్యాపిటల్' భవనం డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడులను ప్రపంచ దేశాలన్ని విస్తుపోయి చూసిన సంగతి తెలిసిందే. అయితే యుఎస్ క్యాపిటల్‌ని ముట్టడించి పోలీసు అధికారులపై దాడి చేసినందుకు గానూ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడు 54 ఏళ్ల రాబర్ట్ స్కాట్ పామర్‌కి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

(చదవండి: ప్లీజ్‌.. నా కారుని ధ్వంసం చేయోద్దు!)

అప్పటి దాడుల్లో పామర్‌ క్యాపిటల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు కాని చివరికి భద్రతా అధికారులు మోహరించి పెప్పర్ స్ప్రే చేయడం వలన వెనక్కి తగ్గాడని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు పామర్‌ ట్రంప్ అనుకూల ప్యాచ్‌లతో అలంకరించబడిన అమెరికన్ జెండా జాకెట్‌ని ధరించి "ఫ్లోరిడా ఫర్ ట్రంప్" అని వ్రాసిన టోపీని పెట్టుకుని ఉ‍న్నట్లు ఫోటోల్లోనూ, వీడియోల్లోనూ కనిపించాడు.

ఈ మేరకు పామర్‌పై అక్టోబరు 4న నేరారోపణ నిర్థారణ అయిన తర్వాత కూడా అతను తన చర్యలను సమర్థించకునే ప్రయత్నం  చేశాడు. అయితే దేశ అ‍ధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలనే దురుద్దేశంతోనే పామర్ ఉద్దేశపూర్వకంగా పెద్ద అల్లర్ల సమూహంలో చేరాడు అని అమెరికన్‌ కోర్టు పేర్కొంది. శాంతియుతంగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికల అధికార మార్పిడిని అణచివేయాలనే రాజకీయ దురుద్దేశంతోనే పామర్ ఈ హింసకు పాల్పడ్డాడని కోర్టు స్పష్టం చేసింది.

ఈ మేరకు యూఎస్‌ కోర్టు ఈ నేరాలకు గానూ పామర్‌కి ఐదేళ్లు జైలు  శిక్ష విధించింది. అంతేగాక ఇదే కేసులో అధికారిక విచారణకు ఆటంకం కలిగించారనే అభియోగాలతో మరో ఇద్దరికి 41 నెలల జైలు శిక్ష విధించింది. పైగా ఈ దాడులకి సంబంధించిన సూమారు 700 మందిని అరెస్టు చేసినట్లు యూఎస్‌ పోలీసులు తెలిపారు. అయితే వారంతా క్యాపిటల్‌లోకి అక్రమంగా ప్రవేశించడం వంటి చిన్న చిన్న నేరాలకు పాల్పడిని వారని అధికారులు పేర్కొన్నారు.

(చదవండి: తగ్గేదేలే! నువ్వు ముందు విమానం నుంచి దిగిపో!)

మరిన్ని వార్తలు