మనుషులిద్దరు... గుండెచప్పుడు ఒకటే

25 Nov, 2021 04:21 IST|Sakshi

భార్యాభర్తల బంధమంటే... ఇద్దరు మనుషులు ఒక జీవితమని తెలుసు. కానీ ఇద్దరు మనుషులు.. ఒకటే గుండె చప్పుడని ఇప్పుడు రుజువైంది. ఇష్టమైన వాళ్లు దగ్గరగా వస్తే గుండె వేగంగా కొట్టుకోవడం చాలా సినిమాల్లో కనిపించే సీన్‌. ఎక్కువకాలం బంధంలో ఉన్న స్త్రీ, పురుషుల గుండె చప్పుడు కూడా ఒకటే అవుతోందని ఇలినాయిస్‌ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ప్రొఫెసర్‌ ఓగోస్కీ నేతృత్వంలో జరిగిన ఈ పరశోధనా ఫలితాలు ఇటీవల ‘సోషల్‌ అండ్‌ పర్సనల్‌ రిలేషన్‌షిప్స్‌’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఎక్కువకాలం రిలేషన్‌లో ఉన్న కొన్ని జంటలను తీసుకుని.. వాళ్ల మధ్య దూరం, వారిద్దరి గుండె చప్పుడును లెక్కించారు. 64 నుంచి 88 మధ్య వయసుండి... 14 నుంచి 65 ఏళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న పది జంటలను పరిశోధకులు రెండు వారాలపాటు పరీక్షించారు. ‘‘దూరంగా ఉన్నప్పుడు ఒకలా ఉన్న గుండెకొట్టకునే తీరు... ఇద్దరూ సమీపంలోకి వచ్చినప్పుడు క్రమంగా ఒక్కటి అవుతోంది. అంటే ఇద్దరూ దగ్గరగా ఉన్నప్పుడు ఒకరి గుండె మరొకరి గుండెను ప్రభావితం చేస్తోంది.

ఒకసారి భార్య గుండె భర్త గుండెపై ఎఫెక్ట్‌ చూపిస్తే... మరోసారి భర్త గుండె భార్య గుండెను ప్రభావితం చేస్తోంది. ముప్ఫై, నలభై ఏళ్లు కలిసి జీవించిన జంటల హృదయం సైతం ఒకరికోసం ఒకరు అన్న అంకితభావంతో పనిచేస్తోంది’’అని ఒగోస్కీ చెప్పారు. -సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 
 

మరిన్ని వార్తలు