ఆన్‌లైన్‌ మోసానికి గురయ్యారా? అకౌంట్‌ ఖాళీ అయిందా? వెంటనే ఈ నెంబర్‌కు కాల్‌ చేయండి

25 Nov, 2021 09:59 IST|Sakshi

పాత వస్తువులను అమ్మకానికి పెట్టాలన్నా... చవగ్గా కొనాలన్నా ఇప్పుడు ఆన్‌లైన్‌ పద్ధతినే చాలా మంది ఎంచుకుంటున్నారు. ఇది సులువైన ప్రక్రియ కావడం కూడా ఇందుకు కారణం. ఇటీవల ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ ఓఎల్‌ఎక్స్‌లో తమ పాత మనీ కౌంటింగ్‌ మిషన్‌ను రూ.5000కు అమ్మకానికి పెట్టింది శ్రీజ(పేరు మార్చడమైనది). ఇమేజ్‌ అప్‌లోడ్‌ చేసిన గంట లోపు ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేస్తాను, తన అడ్రస్‌కు కొరియర్‌ చేయమని సూచించాడు. అందుకు సరే అంది శ్రీజ.

అతను తనకు ఆర్మీ అకౌంట్‌ ఉందని, ముందుగా డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయలేనని, శ్రీజ నే రూ.100 లు ట్రాన్స్‌ఫర్‌ చేయమన్నాడు. సరే అనుకున్న శ్రీజ అతను చెప్పిన అకౌంట్‌కు ఆన్‌లైన్‌ పే యాప్స్‌ ద్వారా రూ.100 ట్రాన్స్‌ఫర్‌ చేసింది. అతను తిరిగి రూ.200 ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఆ తర్వాత తన ఖాతా నుంచి డబ్బు సెండ్‌ అవడం లేదని, ఇతరుల నుంచి డబ్బు తన ఖాతాకు రావడం లేదని మరోసారి శ్రీజ నే కొంత డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేయమన్నాడు.

అలా ఫోన్‌ మాట్లాడుతూనే అతను చెప్పిన సూచనలతో తనకు తెలియకుండానే డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేసింది శ్రీజ. ఆ తర్వాత ఫోన్‌ కట్‌ అయ్యింది. ట్రాన్సాక్షన్స్‌ మెసేజ్‌లు చూసుకున్నాక శ్రీజకు దిమ్మతిరిగిపోయింది. తన అకౌంట్‌ జీరో బ్యాలెన్స్‌ చూపిస్తోంది. తిరిగి ఆ వ్యక్తికి ఫోన్‌ చేస్తే, స్విచ్డాఫ్‌ వస్తోంది. చివరకు తను మోసపోయానని అర్ధమైంది.

ఆన్‌లైన్‌ మోసం.. హెల్ప్‌లైన్‌
కరోనా కారణంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌లు కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. అలాగే, ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగాయి. సైబర్‌ నేరగాళ్లు ఏదో ఒక మార్గంలో వినియోగదారులు/అమ్మకందారుల ఆశను ఎరగా చేసుకొని స్మూత్‌గా డబ్బు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌ చీటింగ్‌ కేసుల్లో మోసపోయిన వ్యక్తులకు సాయం అందించడానికి 155260 హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంది. ఈ నెంబర్‌కు ఫోన్‌ చేసి, ఫిర్యాదు చేస్తే బాధితులు సత్వర న్యాయం పొందే అవకాశం ఉంటుంది.

► ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ హెల్ప్‌లైన్‌ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌... రెండు విధాలా సేవలు అందిస్తుంది.
► సూచించిన పోర్టల్‌లో .. మోసం లావాదేవీ వివరాలు (ఖాతా నంబర్, వాలెట్, యుపిఐ, లావాదేవీ జరిపిన ఐడీ, తేదీ, డెబటి/క్రెడిట్‌ కార్డ్‌ నంబర్లు.. మొదలైనవి), వ్యక్తిగత ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి.
► బాధితుల బ్యాంక్‌ లేదా మోసం చేసి డబ్బు జమ అయిన బ్యాంక్‌/వాలెట్‌.. వంటివి నోట్‌ చేయాలి.
► మోసానికి సంబంధించిన పూర్తి వివరాలను పోర్టల్‌లో 24 గంటల్లోగా ఉంచాలి. ఆ వెంటనే బాధితుడు నమోదు చేసిన ఫోన్‌ నెంబర్‌కి మెసేజ్‌ వస్తుంది.
► పోర్టల్‌లో సంబంధిత బ్యాంక్, అంతర్గత సిస్టమ్‌ల వివరాలను తనిఖీ చేస్తుంది.
► బాధితుడి డబ్బు ఏ ఖాతాకు బదిలీ అయ్యిందో చూసి, ఆ డబ్బును హోల్డ్‌లో ఉంచుతుంది. అంటే, మోసగాడు ఆ డబ్బును పొందలేడు. మోసగాళ్ల చేతికి డబ్బు చేరకుండా తిరిగి పొందేంతవరకు ఈ ప్రక్రియ పునరావృతం అవుతూనే ఉంటుంది.
► సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్స్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా సూచించిన అనేక బ్యాంకుల ఖాతాల నుంచి డబ్బు విత్‌డ్రా చేసినట్లయితే, తదుపరి ప్రక్రియ కోసం సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

భద్రతా సూచనలు...
► ఫోన్‌ సంభాషణల్లో ఉన్నప్పుడు ఎలాంటి బ్యాంకింగ్‌ లావాదేవీలు చేయకూడదు.
► క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం లేదా ఓటీపీ, యుపీఐఎన్, బ్యాంక్‌ కార్డ్‌ సీవీవీ నంబర్లు షేర్‌ చేయడం అంటే మీ ఖాతా నుండి డబ్బును మీరే వదులుకుంటున్నారని అర్ధం.
► కస్టమర్‌ కేర్‌ నంబర్ల కోసం గూగుల్‌ ఇంజిన్లలో ఎప్పుడూ శోధించవచ్చు. సరైన కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం సంబంధిత యాప్‌ లేదా అప్లికేషన్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి, తెలుసుకోవాలి.
► అన్ని ఇ–మెయిల్, సోషల్‌ మీడియా ఖాతాల కోసం రెండు రకాల ఫోన్‌ నంబర్లు వాడటం శ్రేయస్కరం.


అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

>
మరిన్ని వార్తలు