చైనా ఎంట్రీతో ఇక అంతే..!

10 Aug, 2020 18:22 IST|Sakshi

వాషింగ్టన్‌: ఇరాన్‌-చైనా దౌత్య సంబంధాలపై అమెరికా విదేశాంక మంత్రి మైక్‌ పాంపియా ట్విటర్‌ వేదికగా ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో గనుక ఇరాన్‌ దోస్తీ చేస్తే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు తారుమారవుతాయని హెచ్చరించారు. ఇరాన్‌ ఇప్పటికే ఉగ్రవాదులకు అడ్డాగా ఉందని, చైనా వ్యూహంలో చిక్కుకుని ఇరాన్‌ అలాగే మిగిలిపోయే అవకాశముందని జోస్యం చెప్పారు. ఆయుధ వ్యవస్థలు, వాణిజ్యం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చే డబ్బులకు ఆశపడటం అంటే ఆ ప్రాంతాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని పాంపియో ట్విటర్లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ముప్పు పొంచి ఉందనేది స్పష్టమవుతోందని అన్నారు.
(చదవండి: పరస్పర సహకారంతో ముందుకు సాగుదాం)

హాంగ్‌కాంగ్‌ ప్రజాస్వామ్యవాదులను, ముఖ్యంగా ముస్లిం పౌరుల హక్కులను చైనా కాలరాస్తున్న ఉదంతాలే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. అయితే, చాలా దేశాలు డ్రాగన్‌ పడగ నుంచి బయటపడేందుకు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు ప్రారంభించాయని చెప్పారు. చైనాలో ఉంటున్న అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పాంపియో సూచించారు. కాగా, చైనాకు చెందిన పలు యాప్‌లపై అమెరికా ఇటీవల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక చాబహార్‌ రైల్వేలైన్‌ ఇప్పందం నుంచి భారత్‌ని తప్పించిన ఇరాన్‌ డ్రాగన్‌ కంట్రీని దగ్గరవుతుండటం గమనార్హం.
(ఈ బాంధవ్యాన్ని చేజారనీయొద్దు)

మరిన్ని వార్తలు