సూకీకి 5 లక్షల డాలర్లు లంచమిచ్చా

19 Mar, 2021 10:11 IST|Sakshi

సైన్యం అనుకూల నిర్మాణ సంస్థ యజమాని ఆరోపణ

నిర్బంధంలో ఉన్న నేతపై ఒత్తిడి పెంచిన సైనిక జుంటా

మాండలే: మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అధికారపగ్గాలు చేపట్టిన సైనిక పాలకులు, ఆ దేశ నేత అంగ్‌సాన్‌ సూకీపై మరింత ఒత్తిడి పెంచారు. అంగ్‌సాన్‌ సూకీకి 5 లక్షల డాలర్లకు పైగా అందజేసినట్లు సైనిక జుంటా అనుకూల నిర్మాణ సంస్థ యజమాని మౌంగ్‌ వైక్‌ ఆరోపించారు. గతంలో డ్రగ్స్‌ అక్రమ తరలింపు కేసులున్న వైక్‌ గురువారం ప్రభుత్వ ఆధీనంలోని టీవీలో ఈ మేరకు ప్రకటించారు. సూకీ తల్లి పేరిట ఉన్న చారిటబుల్‌ ట్రస్టుకు 2018 నుంచి వివిధ సందర్భాల్లో మొత్తం 5.50 లక్షల డాలర్లను అందజేసినట్లు తెలిపారు. అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు తన వ్యాపారానికి అనుకూలంగా ఉండేందుకు కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు చెప్పుకున్నారు. నిర్బంధంలో ఉన్న సూకీపై సైనిక పాలకులు ఇప్పటికే పలు ఆరోపణలు మోపిన విషయం తెలిసిందే.

వాకీటాకీలను అక్రమంగా కలిగి ఉండటం, ఒక రాజకీయ నేత నుంచి 6 లక్షల డాలర్ల విలువైన బంగారాన్ని తీసుకోవడం వంటివి వీటిలో ఉన్నాయి. సూకీతోపాటు నిర్బంధం అనుభ విస్తున్న దేశాధ్యక్షుడు విన్‌ మింట్‌పై కూడా దేశంలో అశాంతికి కారకుడయ్యారంటూ ఆరోపణలు మోపారు. ఫిబ్రవరి ఒకటో తేదీన అధికారాన్ని హస్త గతం చేసుకున్న సైనిక పాలకులు ప్రజాస్వామ్యం కోసం ప్రజలు తెలుపుతున్న నిరసనలను ఒక వైపు ఉక్కుపాదంతో అణచివేస్తూనే.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన పాలకులను నిర్బంధించి, పలు ఆరోపణలు మోపి విచారణకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా, ఐక్యరాజ్యసమితిలో ప్రజాస్వామ్యా నికి అనుకూలంగా మాట్లాడిన ఆ దేశ రాయబారి క్యామోటున్‌పై సైనిక జుంటా దేశ ద్రోహ నేరం మోపింది. అజ్ఞాతంలో ఉన్న ప్రజానేత మహ్‌న్‌ విన్‌ ఖయింగ్‌ థాన్‌పైనా దేశద్రోహం మోపింది. గురువారం యాంగూన్‌ శివారు ధామైన్‌లో ఆందోళనలు చేపట్టిన ప్రజలు పోలీసులకు రాకను అడ్డుకునేందుకు రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి, వాటికి నిప్పంటించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు