అంతరిక్షంలో... ఆర్మగెడాన్‌!

25 Sep, 2022 05:21 IST|Sakshi

గ్రహశకలాన్ని ఢీకొట్టనున్న ఉపగ్రహం!

అంతరిక్ష రక్షణ పరీక్షల్లో భాగంగా నాసా ప్రయోగం

భూమికి అలాంటి ముప్పును తప్పించడమే ఉద్దేశం

1998లో వచ్చిన సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ మూవీ ఆర్మగెడాన్‌ గుర్తుందా? భూమిని ఢీకొట్టేందుకు శరవేగంగా దూసుకొచ్చే గ్రహశకలం బారి నుంచి మానవాళిని కాపాడే ఇతివృత్తంతో రూపొందింది. అంతరిక్షంలో సోమవారం అచ్చంగా అలాంటి ప్రమాదమే ఒకటి జరగనుంది. కాకపోతే రివర్సులో! ఏడాది క్రితం నాసా ప్రయోగించిన ఉపగ్రహం ఒకటి గంటకు ఏకంగా 24 వేల కిలోమీటర్ల వేగంతో ఓ గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది!

కాకపోతే, భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో జరగనున్న ఈ ప్రమాదం యాదృచ్చికం కాదు. నాసా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే! అంతరిక్ష రక్షణ పరీక్షల్లో భాగంగా డబుల్‌ ఆస్టిరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌ (డార్ట్‌) పేరుతో నాసా తొలిసారిగా ఇలాంటి ప్రయోగానికి తెర తీసింది. ఈ ప్రయోగం అనుకున్నట్టుగా సఫలమైతే ఎప్పుడైనా గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ముప్పు ఎదురైతే దాన్ని తప్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాసా భావిస్తోంది.

32.5 కోట్ల డాలర్ల ఖర్చుతో దాదాపు ఏడాది క్రితం నాసా ఈ డార్ట్‌ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా గత నవంబర్లో డార్ట్‌క్రాఫ్ట్‌ పేరుతో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అది సోమవారం (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4.44 గంటలకు) డైమోర్ఫస్‌ అనే ఓ బుల్లి గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది. ఇది తనకన్నా పెద్దదైన డిడిమోస్‌ అనే గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తోంది.

ఈ రెండు శకలాలూ సోమవారం భూమికి అత్యంత సమీపానికి, అంటే 108 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి రానున్నాయి. అందుకే ఈ ముహూర్తాన్ని నాసా ఎంచుకుంది. ఈ ప్రయోగాన్ని నాసా యూట్యూబ్‌ చానళ్లో లైవ్‌లో చూడొచ్చు కూడా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఉపగ్రహం ఢీకొన్నాక గ్రహశకలం కాంతిలో వచ్చే మార్పులను స్పష్టంగా చూడొచ్చని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు.                  

ఏం జరగనుంది?
► డైమోర్ఫస్‌ కేవలం 525 అడుగుల వెడల్పున్న బుల్లి గ్రహశకలం.
► డార్ట్‌క్రాఫ్ట్‌ గంటకు 24 వేల కి.మీ. బ్రహ్మాండమైన వేగంతో వెళ్లి దాన్ని ఢీకొంటుంది.
► తద్వారా డైమోర్ఫస్‌ తాలూకు వేగాన్ని కాస్త తగ్గించి దాని కక్ష్యలో కొద్దిగా మార్చడం ఈ ప్రయోగం ప్రధానోద్దేశం!
► డైమోర్ఫస్‌ కక్ష్యలో చోటుచేసుకునే మార్పును శక్తిమంతమైన టెలిస్కోపుల ద్వారా పరిశీలిస్తారు.
► డైమోర్ఫస్‌ ప్రస్తుతం డిడిమోస్‌ గ్రహశకలం చుట్టూ 11 గంటల 55 సెకన్లకు ఒకసారి చొప్పున తిరుగుతోంది.
► డార్ట్‌క్రాఫ్ట్‌ ఢీకొట్టి ఆ వేగంలో కనీసం 73 సెకన్ల మార్పయినా వస్తే ప్రయోగం సక్సెస్‌ అయినట్టు.

లాభమేమిటి?
► భూమిని ఢీకొట్టగల గ్రహశకలాల వంటివాటిని ముందే గుర్తించే పరిజ్ఞానం ఇప్పటికే మనకు అందుబాటులో ఉంది. ఈ ప్రయోగం గనుక విజయవంతమైతే అలాంటి వాటిని ముందే ఏ డార్ట్‌క్రాఫ్ట్‌తోనో ఢీకొట్టించడం ద్వారా వాటి ప్రయాణ మార్గాన్ని మార్చవచ్చు. తద్వారా భూమి అంతరించిపోగల పెను ప్రమాదాన్ని తప్పించవచ్చు.
► నాసా నిర్వచనం ప్రకారం 460 అడుగుల కంటే పెద్దదైన అంతరిక్ష శకలం ఏదైనా భూమికి 46 లక్షల మైళ్ల కంటే సమీపానికి వస్తే దానితో భూమికి డేంజరని భావిస్తారు.
► భూమికి సమీపంలో ఇప్పటిదాకా 27 వేలకు పైగా గ్రహశకలాలను గుర్తించారు. కానీ ప్రస్తుతానికైతే వీటిలో మనకు ప్రమాదకరమైనవి లేవు.
► చివరగా, ఈ ప్రయోగంతో భూమికి వచ్చిన ముప్పేమీ లేదని నాసా భరోసా ఇస్తోంది!

– సాక్షి, నేషనల్‌డెస్క్‌

మరిన్ని వార్తలు