ప్రతిపక్షంగా టీడీపీ విఫలం

25 Sep, 2022 05:15 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ నేత విజయసాయిరెడ్డి  

సాక్షి, అమరావతి: ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యత నిర్వర్తించడంలో టీడీపీ ఘోరంగా విఫలమవుతోందని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీతో ప్రజాస్వామ్య పంథాలో టీడీపీ పోటీపడలేకపోతుందన్నారు. అధికార పక్షానికి దీటుగా ప్రజలకు మేలు చేయడంలో టీడీపీ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతోందన్నారు.

ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓవైపు చంద్రబాబు, మరోవైపు నారా లోకేశ్‌ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ప్రభుత్వాన్ని అర్థరహితంగా విమర్శించడం మినహా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంగా ఉండడం టీడీపీకి కొత్తేమీ కాదన్నారు. 1989–94, 2004–2014 మధ్య టీడీపీ ప్రతిపక్షంగా ఉందని గుర్తు చేశారు.

పదేళ్లు అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు సైతం తన రాజకీయ అనుభవాన్ని విస్మరించారని మండిపడ్డారు. డైనమిక్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తండ్రి దారిలోనే లోకేశ్‌ కూడా పయనిస్తున్నారని విమర్శించారు.

ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అధికారులను, పోలీసులను జైళ్లకు పంపిస్తామని హెచ్చరించడం దారుణమన్నారు.   

మరిన్ని వార్తలు