Covid Omicron Restrictions: న్యూజిలాండ్‌ ప్రధాని పెళ్లి వాయిదా!

23 Jan, 2022 16:07 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. లక్షలాది కొత్త పాజిటివ్‌  కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్లతో.. పలు దేశాలు అప్రమత్తమై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వీకెండ్ లాక్‌డౌన్లు, నైట్ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్‌లో కరోనా వైరస్‌, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్‌ ఆంక్షలు.. ఆ దేశ ప్ర‌ధానమంత్రి జసిందా అర్డర్న్ పెళ్లికి అడ్డొచ్చాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో త‌న పెళ్లిని ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ప్రధాని జ‌ెసిందా ప్ర‌క‌టించారు. క్లార్క్ గేఫోర్డ్‌, జెసిందా ఇద్దరు స్నేహితులు. ఇప్పటికే జెసిందా, గేఫోర్డ్ కరోనా కారణంగా పలుమార్లు తమ పెళ్లిని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా ఆంక్షల నేపథ్యంలో మరోసారి తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం వివాహ తేదీని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

ప్రధాని జెసిందా ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని.. ప్రజలతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాతో  ఇబ్బందులను అనుభవిస్తున్నవారిలో తాను కూడా చేరాన‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తోందని దేశ ప్ర‌జ‌లంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు