-

వరల్డ్‌కప్‌ హీరో రచిన్‌ రవీంద్రకు షాక్‌

28 Nov, 2023 12:21 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో నాలుగో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా (10 మ్యాచ​్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 578 పరుగులు) నిలిచిన న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్రకు ఊహించని షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌తో ఇవాల్టి నుంచి (నవంబర్‌ 28) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో రచిన్‌కు న్యూజిలాండ్‌ జట్టులో చోటు దక్కలేదు. రచిన్‌ భీకర ఫామ్‌లో ఉన్నప్పటికీ న్యూజిలాండ్‌ మేనేజ్‌మెంట్‌ అతన్ని పక్కకు పెట్టడం​ విశేషం. బ్యాటర్‌గానే కాకుండా బౌలింగ్‌లోనూ (స్పిన్నర్‌గా) రాణించే సత్తా ఉన్న రచిన్‌ను న్యూజిలాండ్‌ ఎందుకు పక్కన పెట్టిందో తెలియలేదు. 

న్యూజిలాండ్‌ తమ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చింది. స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా అజాజ్‌ పటేల్‌, ఐష్‌ సోధి, పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌గా గ్లెన్‌ ఫిలిప్స్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. కేన్‌ విలియమ్సన్‌ చాలాకాలం తర్వాత టెస్ట్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టిమ్‌ సౌథీ నేతృత్వంలో న్యూజిలాండ్‌ జట్టు బరిలోకి దిగింది. డెవాన్‌ కాన్వే, టామ్‌ లాథమ్‌, విలియమ్సన్‌, హెన్రీ నికోల్స్‌, డారిల్‌ మిచెల్‌, టామ్‌ బ్లండెల్‌ (వికెట్‌కీపర్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, కైల్‌ జేమీసన్‌, ఐష్‌ సోధి, టిమ్‌ సౌథీ, అజాజ్‌ పటేల్‌ సభ్యులుగా ఉన్నారు.

బంగ్లాదేశ్‌ జట్టును నజ్ముల్‌ హసన్‌ షాంటో ముందుండి నడిపిస్తున్నాడు. మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షాహదత్ హుస్సేన్, నూరుల్ హసన్(వికెట్‌కీపర్‌), మెహిదీ హసన్ మిరాజ్, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, షోరీఫుల్ ఇస్లాం సభ్యులుగా ఉన్నారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. లంచ్‌ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. జకీర్‌ హసన్‌ (12), షాంటో (37) ఔట్‌ కాగా.. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (42), మోమినుల్‌ హక్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. అజాజ్‌ పటేల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌కు తలో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు