Health Benefits of Onions: ఉల్లితో మధుమేహం దూరం!

5 Sep, 2022 05:36 IST|Sakshi

కాలిఫోర్నియా: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఈ మాటల్లో నిజముందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహ రోగులకు ఉల్లిపాయ సూపర్‌ ఫుడ్‌ అని, రోజూ ఉల్లిపాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని అమెరికాలోని కాలిఫోర్నియాలో శాన్‌ డియోగాలోని ఎండోక్రైన్‌ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్‌ 2 డయాబెటీస్‌ రోగులకు ఇచ్చే యాంటీ డయాబెటిక్‌ డ్రగ్‌ మెట్‌ఫార్మిన్‌తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ 50శాతం వరకు తగ్గే అవకాశం మెరుగ్గా ఉందని ఆ అధ్యయనంలో తేలినట్టు ది ఇండిపెండెంట్‌ పత్రిక ప్రచురించింది.

మధుమేహ రోగుల చికిత్సలో భాగంగా ఉల్లిపాయను కూడా సూచించవచ్చునని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నైజీరియాలో డెల్టా స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆంటోని ఒజిహె అన్నారు. అయితే తమ పరిశోధనలు ప్రస్తుతం ఇంకా ఎలుకలపైనే చేశామని, త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని చెప్పారు. ‘‘ఉల్లిపాయ తక్కువ ధరకి లభిస్తుంది. డయాబెటీస్‌కి వాడే మందుతో పాటు ఉల్లిపాయ కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ మందు ఇంకా బాగా పని చేస్తుంది.

అయితే ఇంకా ఎలుకల్లోనే ఈ ప్రయోగం జరిగింది’’ అని ఆంటోని వెల్లడించారు. మధుమేహం ఉన్న ఎలుకల్లో రోజుకి 400 ఎంజీ, 600 ఎంజీ ఉల్లిని ఇవ్వడంతో చక్కెర స్థాయి బాగా తగ్గిందని, అంతేకాకుండా కొలస్ట్రాల్‌ కూడా తగ్గినట్టు తేలినట్టుగా వివరించారు. మరోవైపు సెంటర్‌ ఫర్‌ డయోబెటిస్‌ చైర్మన్‌ డాక్టర్‌ అనూప్‌ శర్మ ఈ అధ్యయనంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతీయులు ఉల్లిపాయ చాలా ఎక్కువగా తింటారని అలాంటప్పుడు భారత్‌ మధుమేహగ్రస్తులకు ఎందుకు హాట్‌స్పాట్‌గా మారిందని ప్రశ్నించారు. మానవ ప్రయోగాలు జరిగేంతవరకు ఒక నిర్ధారణకు రాలేమన్నారు.

మరిన్ని వార్తలు