అసీమ్‌ మునీర్‌: ఖాన్‌ పాలిట కొరకరాని కొయ్య.. భారత్‌పై ఆపరేషన్స్‌లో అనుభవం

24 Nov, 2022 16:56 IST|Sakshi

మన పొరుగు దేశం పాక్‌ ఆర్మీకి కొత్త సైన్యాధ్యక్షుడి నియామకం ఇవాళ(గురువారం) జరిగింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ను పాకిస్థాన్‌ సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించింది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు నియామక ఫైల్‌ను ఆ దేశ అధ్యక్షుడి ఆమోదం కోసం పంపింది. అయితే ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని సర్కార్‌ మునీర్‌ను ఎంపిక చేయడం, దాని వెనుక నాటకీయ పరిణామాలు ఉండడంతో రాజకీయపరమైన చర్చ నడుస్తోంది అక్కడ. 

అసీమ్‌ మునీర్‌.. ప్రస్తుతం రావల్పిండిలోని పాక్‌ ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌లో క్వార్టర్‌ మాస్టర్‌ జనరల్‌ హోదాలో ఉన్నారు. ఆయనకు పాక్‌ ఆర్మీలో టూ స్టార్‌ జనరల్‌ హోదా దక్కి నాలుగేళ్లు అవుతోంది. సాధారణంగా పాక్‌ ఆర్మీ చీఫ్‌ పదవికి అర్హత.. లెఫ్టినెంట్‌ జనరల్‌గా నాలుగేళ్ల అనుభవం ఉంటే చాలూ. కానీ, నవంబర్‌ 27వ తేదీన ఆయన లెఫ్టినెంట్‌ జనరల్‌గా అసీమ్‌ పదవీకాలం ముగియబోతోంది. అదే సమయంలో నవంబర్‌ 29వ తేదీతో ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా రిటైర్‌ అవుతారు. ఈ తరుణంలో ఆగమేఘాల మీద అసీమ్‌ పేరును పాక్‌ ఆర్మీ చీఫ్‌గా ప్రకటించడం వెనుక షెహ్‌బాజ్‌ సర్కార్‌ ఉద్దేశం వేరే ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ కారణం.. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు.. అసీమ్‌ మునీర్‌కు అస్సలు పడకపోవడం!. 

ప్రస్తుతం ఉన్న ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వాకు అత్యంత ఆప్తుడు అసీమ్‌ మునీర్‌. బ్రిగేడియర్‌గా ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్యా అనుబంధం ఉంది. మునీర్‌.. 2017లో పాక్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్మహించాడు. ఆపై 2019 ఫిబ్రవరిలో ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌కు చీఫ్‌గా ప్రమోషన్‌ మీద వెళ్లాడు.  అయితే.. అప్పటి అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌తో వైరం.. ఆయన్ని ఐఎస్‌ఐ చీఫ్‌ బాధ్యతల నుంచి ఎనిమిది నెలలకే తప్పించింది.  ఆ స్థానంలో తనకు అనుకూలంగా ఉండే లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫయిజ్‌ హమిద్‌ను నియమించింది ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐ ప్రభుత్వం. ఆపై అసీమ్‌పై ప్రతీకారంతో 30వ కోర్‌కు కమాండర్‌గా బదిలీ చేశారు. ఐఎస్‌ఐ చీఫ్‌ హోదాలో ఉండి ఇమ్రాన్‌ భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించడమే అసీమ్‌ మునీర్‌ తప్పిదం!. తద్వారా పాక్‌ చరిత్రలో ఐఎస్‌ఐకి అత్యంత తక్కువ కాలం చీఫ్‌గా పని చేసిన రికార్డు అసీమ్‌ ఖాతాలో చేరింది.

ఇక.. జజ్వాకు, ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. ఆమధ్య పాక్‌ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాన సమయంలోనూ తనకు అనుకూలంగా వ్యవహరించకపోవడంపై ఇమ్రాన్‌ ఖాన్‌ అసంతృప్తితో రగిలిపోయాడు. పాక్‌ రాజకీయాల్లో ఆర్మీ జోక్యం ఎక్కువైందంటూ బహిరంగ విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలోనూ ముందస్తు ఎన్నికలు డిమాండ్‌ చేస్తున్న ఆయన.. దాదాపు ప్రతీ ప్రసంగంలోనూ ఆర్మీ చీఫ్‌ బజ్వాపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. ఈ తరుణంలో తన ఆప్తుడి(అసీమ్‌) నియామకానికి బజ్వా మద్దతు ఇచ్చారనే చర్చ నడుస్తోంది అక్కడ. బజ్వా సిఫార్సుతోనే ఆర్మీ చీఫ్‌ రేసులో అర్హులైన నలుగురు సీనియర్లు ఉన్నా.. ఇమ్రాన్‌ ఖాన్‌ను కట్టడి చేస్తాడనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్‌కు సిద్ధంగా ఉన్న అసీమ్‌కు కీలక పదవి అప్పజెప్పారనే చర్చ నడుస్తోంది. 

భారత్‌తో ఎలా ఉంటాడో?
భారత్‌పై ఆపరేషన్స్‌లో అసీమ్‌ మునీర్‌కు అనుభవం ఉంది. ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్నప్పుడు.. పుల్వామా దాడి జరిగింది. ఆ సమయంలో పాక్‌ ఆర్మీ కీలక నిర్ణయాల్లో, కార్యకలాపాల్లో మునీర్‌దే కీలక పాత్రగా ఉండేది. దీంతో పాక్‌ కొత్త జనరల్‌ నియామకం భారత్‌-పాక్‌ సంబంధాలపై ప్రభావం చూపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. జనరల్‌ బజ్వా కిందటి ఏడాది మన దేశంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాడు. ఈ నేపథ్యంలో కొత్త జనరల్‌ అసీమ​ మునీర్‌ విధానం ఎలా ఉండబోతుందనే చర్చ మన ఆర్మీలోనూ మొదలైంది. 2025 వరకు మునీర్‌ ఈ పదవిలో కొనసాగనున్నారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు