Karimnagar: ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..! ‘పట్టుకోండి చూద్దాం’ పార్ట్‌–3

24 Nov, 2022 16:52 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..! అన్న పాట.. ఇటీవల ఓ సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు  పాల్పడుతూ.. తనను ఎవరూ ఏమీ చేయలేరని వెక్కిరిస్తూ.. సదరు విలన్‌ అహంకారంతో పాడే సందర్భం అది. 34 ఏళ్ల క్రితం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పంచాయతీరాజ్‌ విభాగంలో అక్రమంగా కొలువు సాధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి కూడా ఇదే పాట పాడుతూ.. ‘తగ్గేదే లే’ అంటున్నాడు.

ఇటీవల సదరు అధికారి బాగోతాలను బయటపెడుతూ ‘సాక్షి’ రాసిన కథనాలకు ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తనపై ఎన్ని విచారణలు వేసినా.. ‘తగ్గేదే లే..’ అంటున్న సదరు అక్రమార్కుడు ఉన్నతాధికారులపై ఎదురుదాడికి సిద్ధమవుతూ కీలక ఆధారాలు మాయం చేసే పనిలో ఉండటం పంచాయతీరాజ్‌ కార్యాలయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎవరినీ లెక్క చేయకుండా సాగుతున్న అధికారి వ్యవహారం తాజాగా అనేక ఆసక్తికర మలుపులు తిరుగుతోంది.

ఎదురుదాడికి సిద్ధం..!
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా.. తనపై విచారణ వేశారని తెలియగానే.. ఉన్నతాధికారులు అడిగిన సమాచారాన్ని బాధ్యతగా అందజేస్తారు. కానీ, ఈ అధికారి మాత్రం విజిలెన్స్‌కు చేరిన ఫైల్‌ను తొక్కిపెట్టడంలో విజయవంతమవుతున్నాడన్న ప్రచారం అతడికి కార్యాలయంలో ఉన్న పట్టును తెలియజేస్తోంది. వాస్తవానికి సదరు అధికారి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. తండ్రి మరణించాడని కారుణ్య నియామక కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో సదరు అధికారి కొలువు సాధించాడు. పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌లో పలు హోదాల్లో పనిచేశాడు. ఇతడి నియామకం చట్ట విరుద్ధమంటూ తోటి ఉద్యోగులంతా గతంలోనే ఈఎన్‌సీకి ఫిర్యాదు చేశారు. అయినా తన తెలివితేటలతో విచారణను నిలిపివేయించుకున్నాడు. 

ఇటీవల ‘సాక్షి’ ఈ అధికారి లీలలను ‘పట్టుకోండి చూద్దాం’ అన్న శీర్షికన అతడి తల్లి ఫించన్‌ వివరాలు, ఆమెను ప్రభుత్వ ఉద్యోగి అంటూ ప్రస్తావించిన కోర్టు తీర్పు కాపీని ప్రచురించిన విషయం తెలిసిందే. అదే సమయంలో సదరు అధికారి డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కోసం డిపొ్లమా (మెకానికల్‌), బీటెక్‌ (సివిల్‌) విద్యను ఎలా (రెగ్యులరా/ దూరవిద్య) చదివాడు? ఎవరు అనుమతించారు? ఏయే దినాల్లో సెలవుపెట్టాడు? అన్న పాయింట్లను లేవనెత్తింది. 

దీంతో ఆయా ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ కరీంనగర్‌ పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ విజిలెన్స్‌ విభాగాన్ని ఆదేశించారు. ఇక్కడే సదరు అధికారి చక్రం తిప్పుడుతున్నారు. ఇప్పుడే సర్వీసు రికార్డుకు సంబంధించిన పలు కీలక ఫైళ్లు మాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘనుడు.. తాజాగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వవద్దని సదరు ఆదేశాలు అందుకున్న అధికారిని మేనేజ్‌ చేయడంలో సఫలీకృతుడు అయ్యాడన్న ప్రచారం మొదలైంది. ఈ విషయం పంచాయతీరాజ్‌ విభాగంలో దుమారం రేపుతోంది. 
చదవండి: ఐటీ దాడులు కొత్త కాదు.. అది తెలీకపోవడం విడ్డూరం: బండి సంజయ్‌

ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ.. అక్రమార్క అధికారికి మరో అధికారి తోడవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అవునా? కాదా?, అతడి సర్టిఫికెట్ల విషయంలో వాస్తవమెంత? అంటూ ఉన్నతాధికారులు సంధించిన ప్రశ్నలకు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమాచారం ఉన్నతాధికారులకు వెళ్తుందా? లేక సదరు అక్రమార్కుడే పైచేయి సాధిస్తాడా? అన్న విషయంపై నేడు స్పష్టతరానుంది.

జెడ్పీలో అధికారి సస్పెన్షన్‌ !
జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న అధికారి కూడా నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలపై సస్పెండ్‌ కావడం కలకలం రేపుతోంది. విద్యార్హతలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాడని ఓ జూనియర్‌ అసిస్టెంట్‌కు అధికారులు సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఇవే ఆరోపణలపై ఆయనకు కొంతకాలంగా ఇంక్రిమెంట్లలోనూ కోత విధించిన అధికారులు తాజాగా సస్పెండ్‌ చేయడం గమనార్హం. వేములవాడలో పనిచేసే సదరు అధికారిని ఇటీవల 317 జీవో అమలులో భాగంగా కరీంనగర్‌కు కేటాయించారు. ఇతడి సర్టిఫికెట్లపై విచారణ జరిపిన అధికారులు ఎట్టకేలకు అవి నకిలీవని తేలడంతో ఈ మేరకు చర్యలు చేపట్టారు.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు