ఐరాసలో పాక్‌ నోట మళ్లీ ‘కశ్మీర్‌’ మాట

23 Sep, 2023 06:26 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌ అంశాన్ని మరోసారి పాకిస్తాన్‌ ప్రస్తావించింది. భారత్‌తో సంబంధాలు సజావుగా కొనసాగేందుకు కశ్మీరే కీలకమని పాక్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్‌ హక్‌ కకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. భారత్‌ సహా అన్ని పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని పాకిస్తాన్‌ కోరుకుంటోందని చెప్పారు.

అయితే, భారత్‌తో సంబంధాల విషయంలో మాత్రం కశ్మీరే కీలకమన్నారు. కశ్మీర్‌కు సంబంధించి భద్రతా మండలి చేసిన తీర్మానాలన్నిటినీ అమలయ్యేలా చూడాలని కోరారు. ఐరాస మిలటరీ అబ్జర్వర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ పాకిస్తాన్‌(యూఎన్‌ఎంవోజీఐపీ)ని తిరిగి అమల్లోకి తేవాలని కకర్‌ అన్నారు. వ్యూహాత్మక, సంప్రదాయ ఆయుధాలపై పరస్పర నియంత్రణకు సంబంధించిన పాక్‌ ప్రతిపాదనను అంగీకరించేలా భారత్‌పై ఒత్తిడి తేవాలన్నారు.

మరిన్ని వార్తలు