భారత్‌లో పాక్‌ ప్రభుత్వ ట్విటర్‌ ఖాతా నిలిపివేత.. కారణం అదేనా?

1 Oct, 2022 14:37 IST|Sakshi

పాకిస్తాన్‌ ప్రభుత్వ అధికారిక ట్విటర్‌ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. లీగల్‌ డిమాండ్‌ నేపథ్యంలోనే శనివారం నుంచి ఆ ఖాతాను భారత్‌లో ట్విటర్‌ బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. 

సాధారణంగా కోర్టు ఆదేశాల తరహా డిమాండ్‌కు ప్రతిస్పందనగా ట్విటర్‌ ఇలాంటి చర్యలు తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు పాక్‌ గవర్నమెంట్‌ ట్విటర్‌ అకౌంట్‌ను ఉన్నపళంగా ఎందుకు బ్లాక్‌ చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(PFI)పై భారత్‌లో నిషేధం నేపథ్యంలో ఆ సంస్థ సోషల్‌ మీడియా అకౌంట్లను బ్లాక్‌ చేసింది. తర్వాత ఇప్పుడు పాక్‌ ప్రభుత్వ ట్విటర్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయడం గమనార్హం. పీఎఫ్‌ఐపై భారత ప్రభుత్వ నిషేధాన్ని పాక్‌ అధికారులు ఖండిస్తూ.. బహిరంగంగా ప్రకటనలు సైతం విడుదల చేశారు.

అయితే.. ఇలా పాక్‌కు చెందిన అకౌంట్లను బ్లాక్‌ చేయడం, తిరిగి పునరుద్ధించడం కొత్తేం కాదు. గతంలోనూ ఇలా చాలాసార్లే జరిగింది కూడా. జూన్‌ నెలలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 2000 కింద న్యూఢిల్లీ వర్గాలు చాలావరకు రాయబార కార్యాలయాలు, జర్నలిస్టులు, కొందరు ప్రముఖుల అకౌంట్లను నిషేధించిందని పాక్‌ మీడియా కథనాలు ప్రచురించింది. ఐరాసలో పాక్‌ రాయబార కార్యాలయం, టర్కీ, ఇరాన్‌, ఈజిప్ట్‌లలోనూ పాక్‌ రాయబార కార్యాలయ ట్విటర్‌ అకౌంట్లను భారత్‌ బ్లాక్‌ నిషేధించింది. 

అంతేకాదు.. 8 యూట్యూబ్‌ ఆధారిత న్యూస్‌ ఛానెల్స్‌(అందులో ఒకటి పాక్‌కు చెందింది కూడా), ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ‘భారత్‌ వ్యతిరేక, ఫేక్‌ కంటెంట్‌’ను పోస్ట్‌ చేసిందనే నెపంతో బ్లాక్‌ చేసింది భారత్‌. భారత్‌ వ్యతిరేక కంటెంట్‌ పోస్ట్‌ చేసినందుకుగానూ మొత్తం 100 యూట్యూబ్‌ ఛానెల్స్‌, నాలుగు ఫేజ్‌బుక్‌ పేజీలు, ఐదు ట్విటర్‌ అకౌంట్లు, మూడు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను బ్లాక్‌ చేసింది.

ఇదీ చదవండి: అన్నీ బీజేపీ గుప్పిట్లోనే ఉన్నాయ్‌ కదా!

మరిన్ని వార్తలు