49మంది ప్రయాణికులతో వెళ్తూ సరస్సులో కూలిన విమానం

6 Nov, 2022 14:59 IST|Sakshi

దార్ ఎస్ సలాం: ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. బుకోబా నగరంలో ల్యాండింగ్‌ కావాల్సిన కొద్ది సమయానికి ముందే వాతావరణం అనుకూలించకపోవటంతో సరస్సులో పడిపోయింది. ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. 

‘ప్రెసిషన్ ఎయిర్ ఫ్లైట్‌ ప్రమాదానికి గురైంది. ఎయిర్‌పోర్ట్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న నీటిలో పడిపోయింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు భద్రతా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.’ అని రీజనల్‌ పోలీస్‌ కమాండర్‌ విలియమ్‌ వాంపఘేల్‌ తెలిపారు. మరోవైపు.. విమానంలో ప్రయాణికులు 49 మంది ఉన్నట్లు స్థానిక మీడియాలు నివేదించగా.. ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉడొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. టాంజానియా ఆర్థిక రాజధాని దార్‌ ఎస్‌ సలాం నుంచి బుకోబాకు ప్రయాణిస్తోంది. 

ప్రెసిషన్‌ ఎయిర్‌ సంస్థ టాంజానియాలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ. విమాన ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. ప్రమాద ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఉత్తర టాంజానియాలో సఫారీ సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో 11 మంది చనిపోయిన 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రమాదం జరిగింది. 

ఇదీ చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్‌ రికార్డ్‌.. ‘కీహోల్‌’లోంచి ఏడు బాణాలు!

మరిన్ని వార్తలు