పాకిస్తాన్‌లో దారుణ పరిస్థితులు.. తిండి కోసం ఎగబడి 11 మంది..

30 Mar, 2023 10:56 IST|Sakshi

దాయాది దేశం పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. తినడానికి తిండి లేక పాకిస్తాన్‌ ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక, ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పిండిని తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ సహా 11 మంది మృత్యువాతపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. ఆర్థిక సంక్షోభం కారణంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో పాకిస్తాన్‌ ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. సామాన్యులు తమ కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ప్రావిన్స్‌లో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పిండిని తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఉచితంగా గోధుమ పిండిని సరఫరా చేసేందుకు వస్తున్న ఓ​ ట్రక్కుపైకి జనాలు ఎగబడ్డారు. రన్నింగ్‌లో ఉన్న ట్రక్కుపైకి ఎక్కి బస్తాల కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. 

దీంతో, అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని సహివాల్‌, బహవాల్‌పూర్‌, ముజఫర్‌గఢ్‌, ఒఖారా ప్రాంతాలపోటు, ఫైసలాబాద్‌, జెహానియాన్‌, ముల్తాన్‌ జిల్లాల్లో తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం 50 ఏండ్ల రికార్డు స్థాయికి చేరింది. దీంతో నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. అయితే పవిత్ర రంజాన్ మాసం కావడంతో ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ధరాభారం నుంచి కొద్దిగానైనా ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా గోధుమ పిండిని సరఫరా చేస్తున్నది. దీంతో, ఇలా తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

మరిన్ని వార్తలు