ఈయూతో బంధం పదిలం

30 Oct, 2021 04:56 IST|Sakshi

కరోనాపై పోరాటం, వాణిజ్యం, పర్యాటక రంగాల్లో సహకారం

ఈయూ అత్యున్నత అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ

ఇటలీ ప్రధాని డ్రాఘీతో సమావేశం

రోమ్‌:  యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ), భారత్‌ మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. జి–20 సదస్సులో పాల్గొనడానికి యూరప్‌ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇటలీలోని రోమ్‌లో ఈయూ అత్యున్నత అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. కోవిడ్‌–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లు, ఈయూ–భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం, అఫ్గానిస్తాన్, ఇండో–ఫసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు.

కరోనా నేపథ్యంలో ఆరోగ్యం, వాణిజ్యం, సంస్కృతి, పర్యాటకం తదితర రంగాల్లో భారత్, ఈయూ మధ్య బంధాన్ని మరింత సుదృఢం చేసుకోవాలని నిర్ణయించారు. యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మిషెల్, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వన్‌ డెర్‌ లెయన్‌తో లోతైన చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్‌ చేసింది.

ఆర్థిక రంగంలో సహకారంతో పాటు, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను పెంచి, మెరుగైన సమాజాన్ని స్థాపించడానికి కృషి చేయాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా పేర్కొంది. మరోవైపు యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ పచ్చదనం నెలకొల్పడంలో భారత్‌ కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఇండో–ఫసిఫిక్‌ ప్రాంతంలో పట్టు కోసం చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్‌ అభిప్రాయాలను గౌరవిస్తామని ఈయూ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ శనివారం నుంచి జి–20 భేటీకి రానున్నారు.

మోదీకి ఈయూ అభినందనలు
భారత్‌లో తక్కువ వ్యవధిలోనే 100 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినందుకు గాను ప్రధాని మోదీని ఈయూ అధికారులు అభినందించారు. ఆయనను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఇరుపక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సరైన పట్టాలు ఎక్కిందని యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు లెయెన్‌ పేర్కొన్నారు.

జాతిపితకు ప్రధాని నివాళులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్‌లో శుక్రవారం భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘‘ఎవరి ఆదర్శాలైతే ప్రజల్లో ధైర్య సాహసాలను నింపుతాయో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయో అలాంటి మహాత్ముడికి రోమ్‌లో నివాళులర్పించే అరుదైన అవకాశం నాకు లభించింది’’ అని మోదీ అనంతరం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అనంతరం ప్రధాని రోమ్‌లో ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు మోదీకి డ్రాఘీ ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. 

మరిన్ని వార్తలు