యుద్ధంలో రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. దూసుకెళ్లిన ఉక్రెయిన్ సేనలు

17 Sep, 2022 18:01 IST|Sakshi

కీవ్‌: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సేనలు తమ భూభాగాన్ని తిరిగిపొందేందుకు శుత్రుదేశాన్ని చావుదెబ్బకొడుతూ ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యాతో సరిహద్దు ప్రాంతమైన ఆగ్నేయ ఖార్కివ్‌ను ఉక్రెయిన్ దాదాపు తిరిగి తమ హస్తగతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓస్కిల్ నది, స్వాతోవే మధ్య రష్యా సేనలు ఏర్పాటు చేసిన రక్షణ వలయాన్ని ఉక్రెయిన్ దళాలు నిర్వీర్యం చేశాయి. ఆ ప్రాంతాన్ని దాటి ముందుకెళ్లాయి. దాదాపు తమ భూభాగంలో మెజారిటీ భాగాన్ని తిరిగి పొందాయి.

ఉక్రెయిన్ సైన్యం ఇ‍చ్చిన ఊహించని షాక్‌తో రష్యా సేనలు వెనక్కి తగ్గినట్లు బ్రిటన్ రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గత్యంతరం లేక ఆ ప్రాంతానికి దూరంలో మరో రక్షణవలయాన్ని రష్యా సైన్యం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాయి. ఒకవేళ దాన్ని కూడా ఉక్రెయిన్ దళాలు తిరిగి ఆక్రమించుకోగలిగితే యుద్ధంలో రష్యాకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాయి.

మరోవైపు ఉక్రెయిన్‌లోని ఇజియం నగరం నుంచి రష్యా దళాలు వెనుదిరిగిన తర్వాత ఉక్రెయిన్‌ అధికారులు అక్కడ శవాల దిబ్బను గుర్తించారు. అక్కడ దాదాపు 440 మృతదేహాలున్నట్లు చెప్పారు. అయితే కచ్చితంగా ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని పేర్కొన్నారు.

440 మంది మృతుల్లో వందలాది మంది పౌరులు, పిల్లలు, ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. కొంతమందిని చిత్రహింసలు పెట్టి, మరొకొంతమందిని బాంబులతో చంపి ఉంటారని తెలిపారు. రష్యా మారణహోమానికి ఇదే నిలువెత్తు సాక్ష‍్యమన్నారు. మరోవైపు ఉక్రెయిన్ సేనలు తమ భూభాగాన్ని తిరిగిపొందుతున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చదవండి: నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి..

మరిన్ని వార్తలు