Russia-Ukraine war: పుతిన్‌ కుమార్తెలపై ఈయూ ఆంక్షలు

9 Apr, 2022 04:55 IST|Sakshi

రష్యా బొగ్గు దిగుమతులపై నిషేధం

బ్రసెల్స్‌: పుతిన్‌ కుమార్తెలిద్దరిపై యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించింది. రష్యాను నిలవరించేందుకు పలు కంపెనీలపై, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ఈయూ తాజాగా మరి కొందరితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో పుతిన్‌ కుమార్తెలు మారియా, కేటరీనా ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరి ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు వీరి ప్రయాణాలపై నిషేధాన్ని విధించారని ఈయూ అధికారులు తెలిపారు. ఇప్పటికే పుతిన్‌ కూతుర్లపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! ఉక్రెయిన్‌లో రష్యా క్రూర చర్యలకు పాల్పడిందన్న వార్తలకు సాక్ష్యాలున్నాయంటూ ఈయూ తాజా ఆం క్షల జాబితాను విడుదల చేసింది. రష్యాలో రిజిస్టరైన నౌకల ను ఈయూ రేవుల్లోకి అనుమతించకూడదని నిర్ణయించారు.

కోల్‌ బ్యాన్‌
రష్యా బొగ్గు దిగుమతులను నిషేధించాలని కూటమి దేశాలు నిర్ణయించుకున్నాయి. దీంతో తొలిసారి రష్యా ఇంధన ఉత్పత్తులు ఆంక్షల జాబితాలోకి చేరినట్లయింది. ఆగస్టు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే చమురు, సహజవాయు దిగుమతులపై మాత్రం సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం రాలేదు. ఏటా దాదాపు 440 కోట్ల డాలర్ల బొగ్గును రష్యా నుంచి ఈయూ దిగుమతి చేసుకుంటోంది. యూఎస్‌ తదితర దేశాల నుంచి బొగ్గు దిగుమతులు పెంచుకోవడం ద్వారా రష్యా దిగుమతుల నిషేధ లోటును ఎదుర్కోవాలని ఈయూ నిర్ణయించింది.

రష్యా బొగ్గుదిగుమతులపై నిషేధంతో ఈయూలోని కొన్ని దేశాల్లో కరెంటు చార్జీలు విపరీతంగా పెరగనున్నాయని రైస్టాడ్‌ ఎనర్జీ అంచనా వేసింది. చమురు, సహజవాయువుల విషయంలో మాత్రం ఈయూలోని చాలా దేశాలు అత్యధికంగా రష్యాపై ఆధారపడినందున నిషేధంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఒకవేళ వీటిపై నిషేధం విధించినా రష్యాకు పెద్దగా సమస్య ఉండదని, తక్కువ ధరకు ఇండియా, చైనాకు రష్యా అమ్ముకోగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో గల్ఫ్‌ దేశాలు భారీ రేట్లకు ఈయూ దేశాలకు వీటిని ఎగుమతి చేస్తాయని, దీనివల్ల ఆయా దేశాలపై పెను భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు