రష్యా నేరాలపై ఐసీసీలో విచారణ

4 Mar, 2022 09:45 IST|Sakshi

హేగ్‌: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడిలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) విచారణ ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న నరమేధంపై విచారణ ప్రారంభించినట్టుగా ఐసీసీ ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌ చెప్పారు. రష్యా యుద్ధ నేరాలపై విచారణ జరగాలని అంతర్జాతీయంగా తీవ్రమైన  ఒత్తిడి పెరుగుతోంది.

రష్యా అనాగరిక చర్యలపై విచారణ జరిపించి దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రి లిజ్‌ ట్రస్‌ డిమాండ్‌ చేశారు. న్యాయం జరిగే వరకు యూకే, దాని మిత్రదేశాలు పోరాటం చేస్తాయని చెప్పారు. రష్యా చేస్తున్న నేరాలకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరిస్తున్నామని తెలిపారు. రష్యా నేరాలపై విచారణకు ఐసీసీ న్యాయమూర్తులు అంగీకరించిన తర్వాత ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌ తాము ఆధారాలు సేకరించే పని మొదలు పెట్టినట్టుగా తెలిపారు.

ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఈ దాడుల్లో 2 వేల మందికిపైగా పౌరులు మరణించారని చెబుతోంది. రష్యా విచక్షణారహితంగా పౌరులు నివసించే ప్రాంతాలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటివాటిపై బాంబులు వేస్తూ ఉండడంతో హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో మానవ హక్కుల హననం జరుగుతోందని ఐసీసీ విచారణకు అంగీకరించడంతోనే అర్థమవుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తాత్కాలిక అధ్యక్షుడు బల్కీస్‌ జర్రా చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్,అధికారులపై అభియోగాలు మోపే అవకాశాలున్నాయి.  

(చదవండి: భారత్‌పై కాట్సా.. బైడెన్‌దే నిర్ణయం)

మరిన్ని వార్తలు