Russia Ukraine war: లైమాన్‌.. రష్యా హస్తగతం!

29 May, 2022 05:38 IST|Sakshi

రైల్వే జంక్షన్‌ను ఆక్రమించిన రష్యా

సీవిరోడోంటెస్క్, లీసిచాన్‌స్క్‌పై వైమానిక దాడులు

కీవ్‌/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం తీవ్రంగా పోరాడుతోంది. మారియుపోల్‌ అనంతరం డోన్బాస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో పెద్ద నగరమైన లైమాన్‌ను తమ దళాలు, వేర్పాటువాదులు హస్తగతం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్‌ కొనాషెంకోవ్‌ శనివారం ప్రకటించారు. ముఖ్యమైన రైల్వే జంక్షన్‌ను సైతం ఆక్రమించినట్లు తెలిపారు.

లైమాన్‌కు విముక్తి కల్పించామని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24 కంటే ముందు లైమాన్‌లో 20 వేల జనాభా ఉండేది. యుద్ధం మొదలైన తర్వాత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఉక్రెయిన్‌ ప్రభుత్వం తరలించింది. ఇక్కడున్న రైల్వే జంక్షన్‌లో రష్యా దళాలు పాగా వేశాయి. లైమాన్‌పై పట్టుచిక్కడంతో డోంటెస్క్, లుహాన్‌స్క్‌ను స్వాధీనం చేసుకోవడం రష్యాకు మరింత సులభతరం కానుంది. ఈ రెండు ప్రావిన్స్‌లను కలిపి డోన్బాస్‌గా వ్యవహరిస్తారు.

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఆక్రమించలేక విఫలమైన రష్యా డోన్బాస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.  లుహాన్‌స్క్‌ ప్రావిన్స్‌లోని నగరాలైన సీవిరోడోంటెస్క్, లీసిచాన్‌స్క్‌లో రష్యా వైమానిక దాడుల శనివారం కూడా కొనసాగాయి. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగానే ఉందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. అయినప్పటికీ తమ దేశానికి ముప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ ఒక స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తుందని అన్నారు.

50 ఏళ్ల దాకా రష్యా సైన్యంలో చేరొచ్చు
సైన్యంలో కాంట్రాక్టు సైనికుల నియామకాల కోసం వయోపరిమితిని పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శనివారం సంతకం చేశారు. ఈ బిల్లు ప్రకారం.. 50 ఏళ్ల వయసు లోపు ఉన్నవారు కాంట్రాక్టు జవాన్లుగా రష్యా సైన్యంలో చేరి సేవలందించవచ్చు. పురుషులైతే 65 ఏళ్లు, మహిళలైతే 60 ఏళ్లు వచ్చేదాకా సైన్యంలో పనిచేయొచ్చు. వార్షిక బోర్డర్‌ గార్డ్స్‌ దినోత్సవంలో పుతిన్‌ పాల్గొన్నారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లను అభినందించారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్, జర్మనీ చాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌తో పుతిన్‌ ఫోన్‌లో మాట్లాడారు. తమ దేశంపై ఆంక్షలు ఎత్తివేస్తే ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు ఎగమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్‌ చెప్పారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వొద్దని మాక్రాన్, షోల్జ్‌కు సూచించారు. ఆయుధాలు సరఫరా చేస్తే ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. పరిమాణాలను ప్రమాదకరంగా మార్చొద్దని చెప్పారు.

మరిన్ని వార్తలు