మూడో దశ ప్రయోగాలకు రష్యా యోచన..

20 Aug, 2020 20:00 IST|Sakshi

మాస్కో: కరోనా వైరస్‌ ప్రభావంతో అన్ని దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే కరోనాను నిర్మూలించే క్రమంలో వివిధ దేశాలు వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో కరోనాను నిర్మూలించే వ్యాక్సిన్‌ తీసుకొచ్చినట్లు ఇటీవల రష్యా ప్రకటించింది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను రష్యా మీడియాకు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రష్యా వ్యాక్సిన్‌ కేవలం రెండు దశలను మాత్రమే పూర్తి చేసిందని, అడ్వాన్స్‌డ్‌ ట్రైల్స్‌ (మూడో దశ ప్రయోగం) పూర్తి చేయలేదని కొన్ని దేశాలు ఆరోపించాయి.

వివిధ దేశాల ఒత్తిడితో మూడో దశ ప్రయోగాలను ప్రారంభించే ఆలోచనలో రష్యా ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మూడో దశలో 40,000 మంది వాలంటీర్లపై కరోనా టీకాను ప్రయోగించనున్నారని టీఏఎస్‌ఎస్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. అయితే కరోనాను దుర్కొనేందుకు ర‌ష్యా 'స్పుత్నిక్' టీకాను ప్ర‌క‌టించినా, మూడో ద‌శ మాన‌వ ప్ర‌యోగాల‌కు సంబంధించిన స‌మాచారంపై స్ప‌ష్ట‌త లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్‌వో) పేర్కొనడంతో రష్యా టీకాపై వివిధ దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అందువల్ల మూడో దశ ప్రయోగానికి రష్యా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు