స్వాతంత్ర దినోత్సవంనాడు నెత్తుటి మరకలు, రక్తపు ముద్దలే మిగిలాయ్‌: జెలెన్‌స్కీ ఆవేదన

25 Aug, 2022 08:22 IST|Sakshi

ఆరు నెలలు యుద్ధం.. ఉక్రెయిన్‌ను శ్మశానంగా మార్చేసింది. ప్రాణ భయంతో లక్షల మంది వలసలు, ఎటు చూసినా దిబ్బలుగా మారిన భవంతులు, అత్యాచారాలకు, హత్యాచారాలకు గురైన బాధితులు, వాళ్ల కుటుంబాల ఆవేదనలే కనిపిస్తున్నాయి. ఈ విషాదాలకు నివాళిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సైతం దూరంగా ఉంది ఆ దేశం. అయినప్పటికీ.. రష్యా సైన్యపు మారణ హోమం ఆగలేదు. 

బుధవారం ఉక్రెయిన్‌ స్వాతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా.. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పిలుపు మేరకు ప్రజలంతా వేడుకలకు దూరంగా ఉన్నారు. అయితే.. ఓ రైల్వే స్టేషన్‌పై రష్యా మిస్సైల్‌ను ప్రయోగించడం.. అది ఓ రైలును ఢీకొట్టడంతో 22 మంది దుర్మరణం పాలయ్యారు. యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

రైల్వే స్టేషన్‌పై దాడి విషయాన్ని అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్‌ ప్రాంతానికి 90 మైళ్ల దూరంలో ఉన్న చాప్లీన్‌ పట్టణంలో  ఓ రైలు మీద మిస్సైల్‌ ప్రయోగం జరిగిందని తెలిపారాయన. ఉక్రెయిన్‌ స్వాతంత్ర దినోత్సవం నాడు నెత్తుటి మరక వేసింది రష్యా.  మాంసం ముద్దలే మిగిలాయి. చాప్లీన్‌కు తగిలిన గాయం మమ్మల్ని బాధిస్తోంది అని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే.. అక్రమణదారులను(రష్యా బలగాలను ఉద్దేశించి..) మా నేల నుంచి తరిమికొడతాం. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఉక్రెయిన్‌ గడ్డపై చెడు జాడ ఉండకూదు అని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే.. రష్యా  రక్షణ విభాగం ఈ దాడిపై స్పందించడం లేదు. 

ఇదీ చదవండి: బైడెన్ టీంలో భారత సంతతి వ్యక్తులదే హవా

మరిన్ని వార్తలు