సౌదీ స్పేస్ మిషన్‌లో లింగ సమానత్వం.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి మహిళా వ్యోమగామి

14 Feb, 2023 09:42 IST|Sakshi

రియాధ్‌: సౌదీ అరేబియా తమ తొలి మహిళా వ్యోమగామి, పురుష వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపుతోంది. ఈ ఏడాది  రెండో త్రైమాసికంలో ఈ మిషన్ చేపట్టనుంది. వ్యోమగాములు రేయానా బర్నావి,  అలీ అల్కార్నీ AX-2 స్పేస్ మిషన్ సిబ్బందిలో చేరతారు.  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకునేందుకు యాక్సియమ్ స్పేస్ చేపడుతున్న రెండో పూర్తి ప్రైవేట్ వ్యోమగామి మిషన్ ఇదే.

మానవ జాతికి సేవ చేయడం, అంతరిక్షం అందించే ప్రయోజనాలు పొందడం కోసం మానవ అంతరిక్షయానంలో సౌదీ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ  మిషన్  లక్ష్యం అని అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది.

ఈ మిషన్ అమెరికా నుంచి ప్రారంభం కానుంది. సౌదీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మరో ఇద్దరు వ్యోమగాములు మరియం ఫర్దౌస్, అలీ అల్గామ్డిలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. సౌది చేపడుతున్న ఈ అంతరిక్ష యాత్ర చారిత్రాత్మకమైనది. ఎందుకంటే ఒకే దేశానికి చెందిన ఇద్దరు వ్యోమగాములను ఒకేసారి ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లిన ప్రపంచంలోని అది కొద్ది దేశాల్లో సౌదీ ఒకటిగా నిలుస్తుంది.

ఇదిలాఉండగా సౌదీ యువరాజు, సౌదీ స్పేస్ కమిషన్ మొదటి ఛైర్మన్ సుల్తాన్ బిన్ సల్మాన్ అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అరబ్, ముస్లిం, రాయల్‌గా అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే. మాజీ రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన ఈయన  జూన్ 17, 1985న పేలోడ్ స్పెషలిస్ట్‌గా అమెరికన్ STS-51-G స్పేస్ షటిల్ మిషన్‌లో ప్రయాణించారు.
చదవండి: ప్రతి నెల 14న ప్రేమికుల రోజు జరుపుకొనే దేశమేదో తెలుసా?

మరిన్ని వార్తలు