Russia - Ukraine war: ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన నిర్ణయం

28 Feb, 2022 23:45 IST|Sakshi

గత కొద్ది రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన శాంతి చర్చలు కూడా విఫలం కావడంతో ఎవరూ తగ్గేదేలే అంటున్నారు. ఎవరికి వారు యుద్ధ ప్రణాళికలు రచిస్తూ ఇరు దేశాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై పోరాటంలో పాల్గొనేందుకు తమ దేశంలోని యుద్ధ అనుభవం ఉన్న ఖైదీలను విడుదల చేస్తానని ప్రకటించారు. యుద్ధంలో పాల్గొనే ఖైదీలకు విముక్తి ప్రసాదిస్తానని పేర్కొన్నారు.

మీ ప్రాణాలు కాపాడుకోండి
ఉక్రెయిన్‌లోని రష్యన్ సైనికులను తమ ఆయుధాలు వదిలి తిరిగి వెల్లాల్సిందిగా పిలుపునిచ్చాడు. దాంతో పాటు ‘మీ ప్రాణాలను కాపాడుకోండి లేదా వదిలివేయండి’ అంటూ వారికి జెలెన్‌స్కీ హెచ్చరికను కూడా జారీచేశారు. అంతేగాక జెలెన్‌స్కీ రష్యన్ సైనికులనుద్దేశించి మాట్లాడుతూ.. మీరు మీ కమాండర్లను, ప్రచారకర్తలను నమ్మవద్దు. మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలని తెలిపారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 4,500 మంది రష్యా సైనికులు మరణించారని ఆయన ప్రకటించారు. 

రాబోయే 24 గంటలు తమ దేశానికి కీలకమైన కాలమని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం బెలారస్‌ దేశ సరిహద్దులో ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం, రష్యా ప్రతినిధులు సమావేశమైన సందర్భంగా దేశ రాజధాని కీవ్‌లో ప్రసంగించిన సందర్భంగా  జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా తమ దేశానికి వెంటనే యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ  కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కుగా భావిస్తున్నానని, అలాగే ఇది సాధ్యమవుతుందని కూడా భావిస్తున్నట్టు జెలెన్‌స్కీ తెలిపారు.

మరిన్ని వార్తలు