కారుచీకటిలో కాంతి రేఖ | Sakshi
Sakshi News home page

కారుచీకటిలో కాంతి రేఖ

Published Tue, Mar 1 2022 1:05 AM

Sakshi Editorial On Ukraine And Russia Peace Talks

భీకరంగా యుద్ధం సాగుతున్న సమయంలో సంధి, శాంతి లాంటి మాటలు ఎడారిలో ఒయాసిస్సులు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన అయిదో రోజైన సోమవారం ఇరుదేశాల ఉన్నత స్థాయి ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు మొదలుకావడం సంతోషకర పరిణామం. చిమ్మచీకట్లు ముసురుకుంటున్నప్పుడు ఇలాంటి ఏ చిన్న కాంతి రేఖ అయినా, పెను ఆశలు రేపుతుంది. నిరంతరాయ యుద్ధంతో 120 గంటలు గడిచాక, వందల మంది ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాక, వేల మంది నిరాశ్రయులయ్యాక, లక్షల కోట్ల డాలర్లు వృథా అయ్యాక... ఇప్పటికైనా చర్చలు మొదలవడం ఫలితంతో సంబంధం లేకుండా ఆహ్వానించదగ్గ విషయమే. 

టీవీ నటుడిగా, కమెడియన్‌గా మొదలై ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగిన జెలెన్‌స్కీ అసలైతే రష్యాతో శాంతి సాధన అంటూ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తే. పీఠమెక్కాక మొదట్లో రష్యాతో చర్చల వేదిక పంచుకున్నా, ఆ ప్రక్రియ ఆగాక, పాశ్చాత్య ప్రపంచపు మైత్రితో కొత్త అవతారమెత్తారు. తాజా యుద్ధ ప్రారంభం నుంచి ఆయన దూకుడునే ప్రదర్శిస్తున్నారు. స్వయంగా ఆయుధం చేతపట్టి, రష్యా లాంటి అగ్రరాజ్యానికి సవాలు విసిరిన సాహసిగా ప్రపంచవ్యాప్త సామాన్య జనం దృష్టిలో రాత్రికి రాత్రి హీరో కూడా అయ్యారు. పౌరుల్లో జాతీయవాదాన్ని ప్రేరేపిస్తూ, యుద్ధోన్ము ఖుల్ని చేస్తున్నారు. ఇక, రష్యా సైతం చర్చలకు పిలుస్తూనే, కయ్యానికి కాలు దువ్వడం ఆపలేదు. అణ్వాయుధాలను సన్నద్ధంగా ఉంచాలంటూ దేశాధ్యక్షుడు పుతిన్‌ ఆదివారం చేసిన ప్రకటనే అందుకు సాక్ష్యం. ఉక్రెయిన్‌ నగరం కీవ్‌పై భారీ దాడికి సిద్ధమవుతున్నట్టు తాజా వార్త. అంటే, చర్చలకు కూర్చున్నా శాంతి పునరుద్ధరణకు రష్యా, ఉక్రెయిన్లకున్న చిత్తశుద్ధి ఏ పాటిదో సందేహమే!

పరిణామాలు శరవేగంగా మారుతూ, చర్చలు కాసేపట్లో ప్రారంభమవుతాయనగా రానున్న 24 గంటలు అత్యంత కీలకమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడైన 44 ఏళ్ళ జెలెన్‌స్కీ ప్రకటించారు. చర్చల ఫలితాలతో సంబంధం లేకుండా ఆ మాట నిజమే. ఎందుకంటే, ‘నాటో’లో చేర్చుకొనే మాట తర్వాత, ముందు తక్షణమే తమను ఐరోపా యూనియన్‌ (ఈయూ)లో చేర్చుకోవాలంటూ ఉక్రెయిన్‌ పక్షాన కోరుతున్నారాయన. అందుకు ఈయూ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ముఖ్యం. అలాగే, ఒకపక్కన చర్చలకు ఓకే అంటూనే రష్యా సైనికులు బతికి బట్టకట్టాలంటే, ఆయుధాలను విడిచిపెట్టాలనీ జెలెన్‌స్కీ గర్జిస్తుండడం గమనార్హం. అది మేకపోతు గాంభీర్యమని కొందరు కొట్టిపారేయవచ్చు. యుద్ధం ముంచుకొచ్చాక సమయానికి తోడు నిలవక పాశ్చాత్య ప్రపంచం తాత్సారం చేసినా, ఇప్పుడాయన ఏ ధైర్యంతో ఈ మాటలు అంటున్నారో చెప్పలేం. ఈ శాంతి చర్చల వల్ల ఒరిగేదేమీ ఉండదని తెలిసినా, యుద్ధాన్ని ఆపే అవకాశాన్ని వదిలేశారని తప్పు బట్టడానికి ఆస్కారమివ్వరాదనే శాంతి చర్చలకు ఓకే అన్నానని ఆయన వీడియో సాక్షిగా అనేశారు.   

అయితే, ఇప్పటికే ఉక్రెయిన్‌ గగనతలంపై రష్యా దాదాపు పూర్తి పట్టు సాధించింది. డాన్‌ బాస్‌ సహా అనేక ప్రాంతాలు రష్యా అధీనంలోకి వచ్చేశాయి. కాబట్టి, కష్టాలు తప్పవని ఉక్రెయిన్‌కూ అవగాహన ఉంది. యుద్ధం మొదలయ్యాక దాదాపు 5 లక్షల మంది ఉక్రెయిన్‌ను విడిచిపోయారనీ, కనీసం వంద మందికి పైగా పౌరులు మరణించారనీ స్వయంగా ఐరాస లెక్క. ఈ పరిస్థితుల్లో రష్యాకు తాము సాగిలపడలేదని చెప్పుకోవడానికీ, ఈ యుద్ధం నుంచి వీలైనంత గౌరవప్రదంగా బయటపడడానికీ ఉక్రెయిన్‌కు సైతం చర్చలు అవసరమే. అందుకే, ఆదివారం మొదట చర్చలకు నో అన్న ఉక్రెయిన్‌ ఆ తర్వాత సర్దుకొని, సరేనంది. సరిహద్దుల్లో ప్రత్యర్థి రష్యన్‌ సైన్యాలకు ఆశ్రయ మిచ్చి, తమపై దాడికి సహకరించిన బెలారూస్‌లో సోమవారం శాంతి చర్చలకు వచ్చి, కూర్చుంది. 

ఈ యుద్ధంలో రష్యా అంచనాలు, వ్యూహాలు సైతం ఆశించినట్టు ముందుకు సాగలేదు. చమురు కోసం రష్యాపై ప్రధానంగా ఆధారపడే ఐరోపా తొందరపడి ఆ దేశంపై చర్యలు తీసుకోదని మొదట భావించారు. కానీ, ఇప్పటి దాకా ‘నాటో’లో ఉక్రెయిన్‌ చేరికను వ్యతిరేకిస్తూ, రష్యాకు సానుకూల ధోరణితో ఉంటూ వచ్చిన ఫ్రాన్స్, జర్మనీలు సైతం యుద్ధ తీవ్రత పెరిగిన వేళ వైఖరి మార్చుకు న్నాయి. ‘నాటో’లోకి ఉక్రెయిన్‌ రాకకు ఓకే అంటున్నాయి. అంటే, ఇప్పటిదాకా భిన్నాభిప్రాయా లున్న ‘నాటో’ దేశాలు ఈ యుద్ధంతో ఒక తాటి మీదకు వచ్చాయనుకోవాలి. ఇది రష్యా గొంతులో పచ్చి వెలక్కాయ. అప్పట్లో ఆఫ్ఘన్‌లా ఉక్రెయిన్‌ను సులభంగా కైవసం చేసుకోవచ్చనుకున్న రష్యాకు ఉక్రెయిన్‌ సైన్యం నుంచే కాక, పౌరుల నుంచీ తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అలా ఇది దీర్ఘకాలిక యుద్ధంగా మారడంతో, పాశ్చాత్య ప్రపంచ తీవ్ర ఆర్థిక ఆంక్షలతో రష్యాకూ తిప్పలు తప్పేలా లేవు. 

ఇప్పటికే రష్యా రూబుల్‌ విలువ 30 శాతం పడిపోయింది. ‘సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్‌’ (స్విఫ్ట్‌) చెల్లింపుల వ్యవస్థను వినియోగించుకోకుండా రష్యాపై పాశ్చాత్య ప్రపంచ నిషేధం మరో కఠిన చర్య. దాదాపు 200 దేశాల్లో 11 వేలకు పైగా ఆర్థిక సంస్థలకు విస్తరించి, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలకు వెన్నెముక లాంటిది ‘స్విఫ్ట్‌’. కొన్నేళ్ళ క్రితం ఇలాగే ‘స్విఫ్ట్‌’ నుంచి ఇరాన్‌ను తప్పించినప్పుడు, విదేశీ వాణిజ్యంలో మూడోవంతు ఆ దేశం కోల్పో యింది. యుద్ధంతో రష్యాలో బిలియనీర్లే బిచ్చగాళ్ళవుతున్నారని వార్తలొస్తున్నాయి. వెరసి, మొదలుపెట్టినంత సులభంగా యుద్ధం ముగించలేమని ఇరుపక్షాలకూ ఈపాటికి అర్థమై ఉంటుంది. కానీ, ఎవరి ఆకాంక్షలు, అంతర్గత వ్యూహాలు వారివి. అందుకే తక్షణ శాంతిస్థాపన అయ్యేపనేనా? 

Advertisement
Advertisement