లంక కల్లోలం: కొంప ముంచిన మహీంద రాజపక్స మీటింగ్! ఆ గంటలో జరిగింది ఇదే..

11 May, 2022 19:58 IST|Sakshi

కొలంబో: శ్రీ లంక సంక్షోభం.. ఒక్కసారిగా ఇలా హింసాత్మకంగా మారుతుందని రాజపక్స​ కుటుంబం సహా బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రదర్శనలు నెలల తరబడి నిరసనల రూపంలో కొనసాగుతున్నప్పటికీ.. సోమవారం నాటి పరిణామాలే దారుణమైన మలుపు తిప్పాయి. ఇప్పటిదాకా పది మందికి పైగా మృతి చెందగా.. వందల మంది గాయపడ్డారు. మరోవైపు నిరసన, ఆందోళనకారులపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ కావడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో అసలు ఆ రోజు(సోమవారం) ఏం జరగింది? అనేదానిపై ఆరాలు మొదలయ్యాయి.   

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాల నడుమ.. వందలాది మంది రాజపక్స మద్ధతుదారులు ప్రధాని భవనం టెంపుల్‌ ట్రీస్‌ వైపు ర్యాలీగా చేరుకున్నారు. రాజీనామా చేయొద్దంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. అదే సమయంలో.. మహీంద రాజపక్స సోదరుడు, లంక అధ్యక్షుడైన గోటబయా రాజపక్స.. సంక్షోభ గండం నడుమే ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటునకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ తరుణంలో.. ఆ ప్రయత్నాన్ని సైతం ఆపేయాలంటూ వాళ్లు నినాదాలు చేశారు.  అయితే.. గంట లోపే అక్కడి పరిస్థితి రణరంగంగా మారింది. 

ఉదయం 11 గంటల సమయంలో మద్ధతుదారులంతా టెంపుల్‌ ట్రీస్‌ దగ్గరికి చేరుకున్నారు. వారిని ఉద్దేశించి.. ‘రాజీనామా చేయాల్సిన అవసరం​ ఉందా?’ అని ఆయన(మహీంద రాజపక్స) ప్రశ్నించాడు. వాళ్లంతా ముక్తకంఠంతో ‘అక్కర్లేద’ని సమాధానం ఇచ్చారు. దీంతో తాను రాజీనామా చేయబోనని, దేశం కోసం ఏం చేయాలో తనకు తెలుసని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే ఆ మద్ధతుదారుల్లో కొంతమంది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే.. లంకా కల్లోలానికి కారణమైంది. 

దాడి చేసింది వాళ్లే!
రాజపక్స మద్ధతుదారులు కొందరు ఆగ్రహంతో ఊగిపోతూ.. ప్రధాని నివాసానికి సమీపంలో ఉన్న నిరసనకారుల మీద ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అలా మొదలైన ఘర్షణలు.. హింసాత్మకంగా మలుపు తిరిగాయని రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది. ఆ ఘర్షణల్లో నిరసనకారులు, మహీంద మద్దతుదారులు పరస్సరం దాడులు చేసుకున్నారు. అయితే నిరసనకారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మద్ధతుదారులే దారుణంగా దెబ్బతిన్నారు. ఆ పరిణామంతో నిరసనకారుల్లో ఆగ్రహావేశాలు రాజుకుని.. రాజపక్స కుటుంబం, ఆయన మద్ధతుదారుల ఇళ్లపై దాడులతో విరుచుకుపడ్డారు. ఇదంతా కేవలం గంట వ్యవధిలోనే జరిగిపోయింది.

అలా శ్రీ లంక పొదుజన పెరామునా(SLPP) పార్టీ.. మహీందను ప్రధాని గద్దె నుంచి దిగకుండా చేయాలనుకున్నా ప్రయత్నం మొత్తానికి బెడిసి కొట్టింది.  తన మద్ధతుదారులతో నిర్వహించిన సమావేశం బెడిసి కొట్టడం.. ఆపై హింస ప్రజ్వరిల్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహీంద రాజీనామా చేయడంతో పాటు నేవీ బేస్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే నిరసకారుల వల్లే హింస చెలరేగిందంటూ.. కనిపిస్తే కాల్చివేతల ఉత్తర్వులు జారీ చేసింది లంక రక్షణ శాఖ. ఒకవేళ రాజమహీంద ఆ సమావేశం నిర్వహించకుండా ఉంటే.. పరిస్థితి సాధారణ నిరసనలతో గడిచిపోయేది ఏమో! అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సంబంధిత వార్త: దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది!

మరిన్ని వార్తలు