స్వదేశీ జలాంతర్గామిని తయారుచేసిన తైవాన్‌

29 Sep, 2023 03:02 IST|Sakshi

కవోసియంగ్‌(తైవాన్‌): తరచూ నావికాదళాలతో తమ వైపు దూసుకొస్తూ కవి్వంపు చర్యలకు పాల్పడే చైనాను అడ్డుకునేందుకు తైవాన్‌ తొలిసారిగా జలాంతర్గామిని తయారుచేసుకుంది. ప్రస్తుతం ఈ సబ్‌మెరైన్‌ పరీక్ష దశలో ఉంది. పరీక్షల్లో విజయవంతమై తైవాన్‌ అమ్ములపొదిలో చేరితే ఆ దేశ సైనిక స్థైర్యం మరింత ఇనుమడించనుంది. ‘గతంలో దేశీయంగా జలాంతర్గాముల తయారీ అనేది అసాధ్యం. కానీ ఈరోజు స్వదేశీ జలాంతర్గామి మీ కళ్ల ముందు ఉంది’ అని నౌకాతయారీకేంద్రంలో నూతన జలాంతర్గామి ఆవిష్కరణ కార్యక్రమంలో తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌–వెన్‌ వ్యాఖ్యానించారు.

‘ దేశ పరిరక్షణకు ప్రతినబూనిన మా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం ఈ సబ్‌మెరైన్‌. వ్యూహాలు, యుద్ధతంత్రాల్లో నావికాదళం సన్నద్థతలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది’ అని ఆమె అన్నారు. కొత్త జలాంతర్గామికి హైకున్‌ అని పేరుపెట్టారు. చైనా ప్రాచీనగాథల్లో హైకు అంటే అది్వతీయమైన శక్తులు గలది అని అర్ధం. హార్బర్, సముద్ర పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక నావికాదళానికి అప్పగిస్తారు. 2027 ఏడాదికల్లా రెండు సబ్‌మెరైన్‌లను నిర్మించి దళాలకు ఇవ్వాలని తైవాన్‌ యోచిస్తోంది. తైవాన్‌ సమీప సముద్ర జలాల్లో తరచూ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ యుద్ధవిన్యాసాలు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తున్న చైనాకు ఈ పరిణామం మింగుడుపడనిదే.

మరిన్ని వార్తలు