Talibans warning: పాకిస్తాన్‌కు తాలిబన్ల సీరియస్‌ వార్నింగ్‌.. షాక్‌లో పాక్‌

17 Apr, 2022 18:02 IST|Sakshi

కాబూల్‌: దాయాది దేశం పాకిస్తాన్‌, తాలిబ‍న్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్తాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఆప్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులపై పాక్‌ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 60 మందికిపైగా ఆప్ఘన్‌ సాధారణ పౌరులు మృతిచెందారు.

ఈ నేపథ్యంలో తాలిబన్లు ఆదివారం పాకిస్తాన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. పాక్‌ దాడులపై తాలిబాన్‌ ప్రభుత్వానికి చెందిన సమాచార, సాంస్కృతిక శాఖ ఉప మంత్రి జబివుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. ఆఫ్ఘన్‌ల సహనాన్ని పరీక్షించకండి. ఆ తర్వాత జరిగే తీవ్రమైన పరిణామాలకు పాకిస్తాన్‌ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, మరోసారి వైమానిక దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇలాంటి ఘటన వల్ల రెండు దేశాల మధ్య వివాదాలు పెరుగుతాయన్న ముజాహిద్‌.. దౌత్య మార్గాల్లో సమస్యల పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. పాక్‌ వైమానిక దాడుల అనంతరం ఆప్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని పాకిస్తాన్‌ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌తో తాలిబాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమావేశమైంది. ఈ సందర్బంగా ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించింది.

ఇది చదవండి: సీన్ రివర్స్‌.. మాట మార్చిన ఇమ్రాన్‌ఖాన్‌

మరిన్ని వార్తలు