Star On TikTok: ఈ యుద్ధం జెలెన్‌ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!

18 Mar, 2022 15:50 IST|Sakshi

You Are A Star On TikTok: ఉక్రెయిన్‌ పై రష్యా గత మూడు వారాలకు పైగా భీకరమైన పోరు సలుపుతూనే ఉంది. మరోవైపు అంతర్జాతీయ  న్యాయస్థానం యుద్ధం ఆపాలంటూ జారీ చేసిన ఆదేశాలను సైతం దిక్కరించి ప్రపంచ దేశాల చేత యుద్ధ నేరస్తుడిగా ముద్ర వేయించుకున్నాడు వ్లాదిమిర్‌ పుతిన్‌. అయితే ఈ యుద్ధం పుతిన్‌కి చెడ్డపేరు తెస్తే వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీని హీరో చేసింది. అయితే నిరవధికంగా సాగుతున్న బీకర యుద్ధంలో రష్యా దళాలు వైమానిక దాడులతో  ఉక్రెయిన్‌ని దారుణంగా నాశనం చేస్తున్న తీరు ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించింది.

ఈ తరుణంలో అమెరికా ఉక్రెయిన్‌ అధ్యక్షుడుని మా దేశం వచ్చేయండి విమానం పంపిస్తాం అని గొప్ప ఆఫర్‌ ఇచ్చినప్పటికీ తిరస్కరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు జెలెన్‌ స్కీ. అంతేగాక మా దేశాన్ని రష్యా దురాక్రమణ నుంచి కాపాడుకునేందుకు ఇక్కడే ఉండి పోరాడుతాను మాకు యుద్ధట్యాంకులు, మిలటరీ సాయం అందించండి చాలు అని అడిగారు. అంతేగాదు యుద్ధం వేళ తాను సైతం సైనికుడిగా మారి కథనరంగంలోకి అడుగుపెట్టి దేశాన్ని ముందుండి నడిపించాడు. దీంతో జెలెన్‌స్కీ పేరు ప్రపంచదేశాల్లో మారుమ్రోగిపోయింది. ఎంతలా అంటే అతని పేరుని బ్రాండ్‌నేమ్‌గా వాడుకుని బిజినెస్‌ చేసుకునేంతగా ఫేమస్‌ అయిపోయాడు.

సోషల్‌ మాధ్యమాలు సైతం అతన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో రష్యా దాడిలో గాయపడి ఆసుపత్రిలో చిక్కిత్స పొందుతున్న టీనేజర్‌ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పలకరించారు. ఆ టీనేజర్‌ రాజధాని కైవ్ సమీపంలోని వోర్జెల్ పట్టణం నుంచి బయలుదేరుతున్నప్పుడు రష్యా  దాడిలో గాయపడింది. కాత్య వ్లాసెంకోగా గుర్తించబడిన టీనేజర్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని చూసి ఒక్కసారిగా ఆనందపడిపోతూ..." టిక్‌టిక్‌లో అంతా మీ గురించే మాట్లాడుతున్నారు. మీకే మద్దతిస్తున్నారు." అని జెలన్‌ స్కీతో సంతోషంగా చెబుతుంది.

దీంతో జెలన్‌స్కీ చిరునవ్వుతో అయితే మేము ఇప్పుడూ టిక్‌టాక్‌ని ఆక్రమించామా అని అడిగారు. దీంతో ఆమె ఔను అంతా నీ గురించి మాట్లాడతారు అని బదులిచ్చింది. జెలన్‌ స్కీ ఆమెకు పూల బోకేని కూడా బహురించారు. అయితే రష్యన్ బలగాలు జరుపుతున్న దాడి నుంచి కాత్య తన 8 ఏళ్ల తమ్ముడుని కాపాడేందుకు అడ్డుగా నుంచోవడంతో ఆమె తీవ్రగాయలపాలైంది. ఆమె తండ్రి ఆమెను చేతులపై ఆసుపత్రికి తరలించాడు. ఈమేరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు యుద్ధంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పలకరించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

(చదవండి: వరినీ లెక్కచేయని పుతిన్‌.. బైడెన్‌ తీవ్ర వ్యాఖ్యలు.. రష్యా అభ్యంతరం)

మరిన్ని వార్తలు