ఒకరికొకరు సాయం చేసుకుందాం

17 Nov, 2020 21:01 IST|Sakshi

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్‌ దేశాలది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రష్యాలో నిర్వహిస్తున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ఆయన మంగళవారం వర్చువల్‌ విధానంలో ప్రసంగిస్తూ.. ప్రపంచ శాంతికి భారత్ తోడ్పడుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతి పెద్ద సమస్య తీవ్రవాదం అని.. తీవ్రవాదానికి మద్దతిచ్చే దేశాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచ సంస్థల పని తీరుపై పలు ప్రశ్నలు వస్తున్నాయని, ఐఎమ్‌ఎఫ్‌, డబ్ల్యూటీఓ(ప్రపంచ వాణిజ్య సంస్థ), డబ్ల్యూహెచ్‌ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) వంటి సంస్థల్లో కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవ ఏడాది అని మోదీ గుర్తు చేశారు. ఐక్యరాజ్య సమితి నియమాలు, విలువలకు కట్టుబడే దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ గురించి ప్రస్తావిస్తూ తమ దేశంలో ఫార్మా రంగం బలంగా ఉండటంతోనే లాక్‌డౌన్‌ సమయంలో 150 దేశాలకు ఔషధాలు సరఫరా చేయగలిగామన్నారు. మానవజాతి కోసం కోవిడ్‌ నిరోధానికి వ్యాక్సిన్‌ తయారు చేసి ప్రపంచానికి అందించగల సామర్థ్యం భారత్‌కి ఉందన్నారు. బ్రిక్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, యువ శాస్త్రవేత్తల సమావేశం వంటి పలు అంశాలతో మానవ సంబంధాలను మెరుగు పరిచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రక్షణ, అభివృద్ధిలో ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది శాశ్వతంగా ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 

చైనా అధ్య​క్షుడు జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. మనమంతా ఒకే బోటులో ప్రయాణించే ప్రయాణికులమన్నారు. తీవ్రవాదం గురించి మోదీ మాట్లాడిన విషయాలపై స్పందించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌.. ప్రతీ కుటుంబంలో ఒక ‘బ్లాక్‌ షీప్‌’ ఉంటుందన్నారు. ప్రపంచ సుస్థిరత అనే థీమ్‌తో బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదం, వాణిజ్యం, ఆరోగ్యం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. బ్రిక్స్‌లో.. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా సభ్య దేశాలుగా ఉన్నాయి. 

మే నెలలో సరిహద్దు వివాదాలు చేలరేగిన తర్వాత భారత ప్రధాని మోదీ, చైనా అధ్య​క్షుడు జిన్‌పింగ్‌ ఒకే వర్చువల్‌ వేదికపై కనిపించడం ఇది రెండవసారి.

మరిన్ని వార్తలు