Turkey–Syria Earthquakes: 11వేలు దాటిన మృతుల సంఖ్య.. మిన్నంటిన ఆర్తనాదాలు

9 Feb, 2023 09:03 IST|Sakshi

గజియాన్‌టెప్‌(తుర్కియే): భూకంప శిథిలాలను తొలగించేకొద్దీ వెలుగుచూస్తున్న విగతజీవులు.. ప్రాణాధార వ్యవస్థలు అందుబాటులోలేక రక్తమోడుతూ సాయం కోసం ఎదురుచూస్తున్న క్షతగాత్రులు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు కాలంతో పోటీపడుతూ నిర్విరామంగా శ్రమిస్తున్న సహాయక సిబ్బంది, స్థానికులు.. ఎటుచూసినా ఆప్తుల ఆక్రందనలు, మిన్నంటిన రోదనా దృశ్యాలతో తుర్కియే, సిరియా భూకంప ప్రభావ ప్రాంతాలు భయానకంగా తయారయ్యాయి. దశాబ్దకాలంలో ఎన్నడూలేనంతటి ఘోర మృత్యుకంపం ధాటికి ఇరుదేశాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య తాజాగా 11,200 దాటేసింది.  

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎర్డోగన్‌ పర్యటన
సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ హతే ప్రావిన్స్, కహ్రామన్‌మరాస్‌ పట్ణణం, భూకంప కేంద్రం గుర్తించిన పజార్‌సిక్‌ పట్టణాల్లో పర్యటించారు. క్షతగాత్రులతో నిండిన తాత్కాలిక ‘టెంటుల సిటీ’లో బాధితులతో మాట్లాడారు. ‘ఎవరినీ ఇలా వీధుల్లో వదిలేసి వెళ్లిపోము. అందరినీ ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. భూకంపం మిగిల్చిన విషాదం మొదలై రెండ్రోజులైన తర్వాత కహ్రామన్‌మరాస్‌ పట్టణంలో శిథిలాల నుంచి మూడేళ్ల బాలుడు ఆరిఫ్‌ ఖాన్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగారు. అదియామన్‌ సిటీలో పదేళ్ల బాలిక బీటల్‌ ఎడీస్‌ను కాపాడారు.

కుప్పకూలిన వేలాది భవంతుల కింద చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న అన్వేషణకు గడ్డకట్టే చలి, మంచు పెద్ద అవరోధంగా మారాయి. తుర్కియేలోని మలాట్యా సిటీలో వీధి పొడవునా మృతదేహాలు ఉంచి మార్చురీ వాహనాల కోసం జనం ఎదురుచూస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. మైనస్‌ ఆరు డిగ్రీ సెల్సియస్‌ వాతావరణంలో శిథిలాల్లో కొందరు చలికే గడ్డకట్టుకుని చనిపోయి ఉంటారని సహాయక సిబ్బందిలో ఒకరైన పికల్‌ వ్యాఖ్యానించారు. టర్కీ అత్యవసర సిబ్బందికి దాదాపు డజను దేశాల నుంచి ఆగమేఘాల మీద వచ్చేసిన సహాయక బృందాలు జతకలిసి బాధితుల అన్వేషణలో బిజీగా మారాయి.  


సిరియాలో పరిస్థితి దారుణం
తుర్కియేతో సత్సంబంధాల కారణంగా చాలా దేశాలు తమ బృందాలను ఆ దేశానినికి పంపి సాయపడుతున్నాయి. కానీ, అంతర్యుద్దం, ద్వైపాక్షిక సంబంధాలు బొత్తిగాలేని సిరియాకు ఇతర దేశాల నుంచి సాయం సరిగా అందట్లేదు. దీంతో అక్కడ సహాయక చర్యలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. దీంతో శిథిలాల్లో బాధితుల ఆక్రందనలు అరణ్యరోదనలయ్యాయి.  సిరియాను ఆదుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. భూకంపంతో ఆ దేశాల్లో 2.3 కోట్ల ప్రజల బ్రతుకులు దుర్భరంగా మారనున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది.

భారత్‌ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు
ఇప్పటికే రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపిన భారత్‌ మరో బృందాన్నీ తుర్కియేకి పంపనుంది. ‘తుర్కియేలో 11 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారిలో ఒకరి జాడ తెలియాల్సిఉంది. మిగతావారు క్షేమం’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. మరోవైపు ఆరు టన్నుల సహాయక సామగ్రిని సిరియాకు భారత్‌ అందజేసింది.

మరిన్ని వార్తలు