వీడియో గేమ్‌: గంటలో లక్ష ఫసక్‌.. కారు అమ్ముకున్న తండ్రి

1 Jul, 2021 10:34 IST|Sakshi

వీడియో గేమ్‌ల పేరుతో జేబులు గుల్ల చేసుకుంటున్న కేసులు చూస్తూనే ఉన్నాం. అయితే అధికారిక గేమ్‌ వంకతో ఓ వ్యక్తిని నిలువునా దోచిన వైనం బ్రిటన్‌లో చోటు చేసుకుంది. అతని ఏడేళ్ల కొడుకు వీడియోగేమ్‌ ఆడుతూ  చేసిన పనితో.. కారు అమ్మేసి మరీ ఆ డబ్బు కట్టాల్సి వచ్చింది.

లండన్‌: నార్త్‌ వేల్స్‌కి చెందిన ఏడేళ్ల బాలుడు అషాజ్‌ తన తండ్రి ఐఫోన్‌లో ‘డ్రాగన్స్‌: రైజ్‌ ఆఫ్‌ బెర్క్‌’ వీడియో గేమ్‌ ఆడాడు. ఆట మధ్యలో ఒక్కో లెవల్‌ దాటుకుంటూ పోతుండగా.. మధ్య వచ్చిన యాప్‌ యాడ్స్‌ను క్లిక్‌ చేసుకుంటూ పోయాడు. అలా గంట వ్యవధిలో సుమారు రెండు పౌండ్ల నుంచి వంద పౌండ్ల విలువ చేసే యాప్స్‌ కొన్నింటిని కొనుక్కుంటూ పోయాడు. ఆ మొత్తం ఎమౌంట్‌ 1,289 పౌండ్లకు(మన కరెన్సీలో లక్షా ముప్ఫై వేలదాకా) చేరింది.  

ఈ-మెయిల్స్‌ ద్వారా యాపిల్‌ కంపెనీ నుంచి బిల్లులు జనరేట్‌ అయిన విషయం గుర్తించిన ఆ పిల్లాడి తండ్రి ముహమ్మద్‌ ముతాజా.. షాక్‌ తిన్నాడు. కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ అయిన ముతాజా.. అంత స్తోమత లేకపోవడంతో కారును అమ్మేసుకున్నాడు. ఆషాజ్‌కు ఫోన్‌ పాస్‌ వర్డ్‌ తెలిసినప్పటికీ.. ఆటలో అపరిమిత కొనుగోలు వ్యవహారంపై రచ్చ మొదలైంది.

పచ్చి మోసం
నిజానికి అది ఫ్రీ వెర్షన్‌ గేమ్‌. నాలుగేళ్లు పైబడిన పిల్లలు ఎవరైనా ఆడోచ్చు. కానీ, అంతేసి అమౌంట్‌ యాప్‌ల కొనుగోలు యాడ్‌లను ఇవ్వడంపై ముతాజా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కొనుగోళ్లను.. అందులో పెద్ద మొత్తం ఎమౌంట్‌తో అనుమతించడం పెద్ద మోసమని ముతాజా వాపోతున్నాడు. ఇదొక పెద్ద స్కామ్‌గా భావిస్తూ.. యాపిల్‌ కంపెనీకి ఫిర్యాదు చేశాడు. అయితే కొంతలో కొంత ఊరటగా.. 207 పౌండ్లు(సుమారు 21 వేలు) వెనక్కి వచ్చాయి. మరోవైపు పిల్లల గేమ్‌ల్లో పరిమితులు లేని  కొనుగోళ్ల వ్యవహారంపై ఆయన కోర్టును ఆశ్రయించాడు. 

చదవండి: వయసు 24.. సంపాదన ఊహించలేనంత!

మరిన్ని వార్తలు